Breaking News

చండీ దేవి దర్శనం… విజయాలకు సోపానం… ఈరోజు దుర్గమ్మ శ్రీ మహా చండీదేవిగా దర్శనం….!!

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శరన్నవరాత్రి ఉత్సవాలలో నేడు ఐదవ రోజు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జగన్మాత చండీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువ జాము నుంచే భక్తజన సందోహంతో ఆలయానికి వెళ్లే దారులు అన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. వివిధ శాఖల సమన్వయంతో చేసిన ఏర్పాట్ల కారణంగా భక్తులు జగన్మాతను దర్శించుకునేందుకు ఎటువంటి అవాంతరం లేకుండా తనివితీరా అమ్మను దర్శించి భక్తి పారవశ్యంతో భవాని నామస్మరణ చేసుకుంటూ తమ మనసులోని కోరికలను నివేదిస్తున్నారు. వినాయకుడి గుడి నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్ల లో వస్తున్న భక్తులకు దారి పొడవునా మంచినీరు, పసి పిల్లలకు వేడి పాలు స్వచ్ఛంద కార్యకర్తలు నిరంతరం అందించడం, గంటల తరబడి వేచి ఉండే అవసరం లేకుండా సత్వరమే దర్శనం చేసుకొని ఒక ఆధ్యాత్మిక భావనతో ఇంద్రకీలాద్రి పై ఉన్న ఉపాలయాలను కూడా సందర్శిస్తున్నారు. ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దేవస్థానం చేసిన ఏర్పాట్లను ప్రశంసిస్తున్నారు. చండీ దేవి ఆరాధనతో సకల విజయాలు ప్రాప్తిస్తాయనే నమ్మకం కొన్ని శతాబ్దాలుగా భక్తుల విశ్వాసం. ఇంద్రకీలాద్రి పైన, కొండ కింది భాగంలో దేవస్థానం అందిస్తున్న వివిధ ఉచిత సేవలలో ఎటువంటి లోపాలు లేకుండా దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు, దేవాలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామరావు, దేవస్థానం పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు వివిధ విభాగాల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా నిత్య అన్నదానం, ప్రసాదాల కొనుగోలు కేంద్రాలు, ఉచిత వైద్య సేవలు, భక్తులు ఎక్కువగా వస్తున్న సందర్భాలలో వారి నియంత్రణకు అవసరమైన చర్యలు వంటివి తక్షణమే చేపడుతున్నారు. చండీ దేవి దర్శనం కోసం వస్తున్న భక్తుల నమ్మకం ప్రకారం చండీ దేవికి బహుళ నామాలు ఉన్నాయి. చండీ దేవి కాళీదేవిని పోలి ఉంటుంది. ఒక్కోసారి ఆమె దయగల రూపంలో మరియు తరచుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. చండీ దేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి, లేదా హైమవతి, శతాక్షి, శాకంభరీ దేవి, అన్నపూర్ణ, జగన్మాత మరియు భవాని అని పిలుస్తారు. అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమె దుర్గ, కాళి మరియు శ్యామ, చండీ లేదా చండిక, భైరవి, చిన్నమాస్త మొదలైన పేర్లతో పిలువబడుతుంది. చండీదేవి యొక్క పూజ అశ్వినీ మరియు చైత్ర మాసాల శుక్ల ప్రతిపద నుండి నవరాత్రులలో ఒక ప్రత్యేక వేడుకతో భక్తులు జరుపుకుంటారు. నవరాత్రుల మహోత్సవాలల్లో తల్లి చండీ దేవికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దుర్గా దేవి యొక్క తొమ్మిది రూపాల్లో ఒకటైన చండికా దేవి యొక్క రూపం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చండీ దేవి ఎలా అవతరించింది…! మన హిందూ పురాణాలు మరియు హిందూ మత విశ్వాసాల ప్రకారం, రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కునే సమయం వచ్చినప్పుడు, దేవతలు అందరూ ఒకచోట సమావేశమై ఆ పరమ శివుడి వద్దకు వెళ్ళి రాక్షసులు గురించి చెబుతారు. అప్పుడు పరమ శివుడు మాతృ దేవతను స్తుతించాలని కోరారు. అప్పుడు దేవతలు అందరూ కలిసి మాతృ దేవతను ఆరాధించారు. అప్పుడు మాతృ దేవత అనుగ్రహంతో తల్లి సరస్వతి దేవి, లక్ష్మీదేవి మరియు మహాకాళి దేవి చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరిస్తారు. పూజ విధానం గురించి పురాణ గాథల్లో తెలియజేసిన విధానం ఇలా ఉంటుంది. చండీ దేవి పూజ కోసం నవరాత్రి మొదటి రోజున ఒక బ్రాహ్మణుడు ఆవు పేడ మరియు మట్టితో పూత పూసిన ఒక మట్టి కుండను ఆలయం మధ్యలో ఏర్పాటు చేస్తారు. కలశంలో నీటిని తీసుకుని దానిని మామిడి ఆకులతో కప్పి, బియ్యంతో నిండిన మట్టి మూతని కలశం పైన ఉంచి పసుపు గుడ్డతో కప్పుతారు. అదే కలశంలో బ్రాహ్మణ మంత్రాలు చదివిన తర్వాత ఒకరు కుండల నుండి నీటిని చిలకరించి, అదే కలశంలో అమ్మవారిని ఆవాహన చేస్తారు. పూజ మొదటి రోజు నుండి తొమ్మిది రోజుల ఈ కాలంలో, బ్రాహ్మణుడు కేవలం పండ్లు మరియు ఫలాలను మాత్రమే తింటారు. చండీ దేవి పూజ ఒక యాగంతో ముగుస్తుంది. తరువాత హోమం చేయడం మొదలపెడతారు. దానిలో బార్లీ, పంచదార, నెయ్యి మరియు నువ్వులను ఉపయోగిస్తారు. ఈ హోమాన్ని కలశం ముందు చేస్తారు. ఆ కలశంలో దేవత నివసిస్తుందని భావించబడుతుంది. ప్రతి ఒక భక్తుడు చండీదేవి పట్ల ఐక్యంగా పరిగణించబడతారు. చండీ మాత పూజ సమయంలో పారాయణం చేయడానికి కొన్ని ప్రసిద్ధ మంత్రాలు ఉన్నాయి. ఓం ఐం హ్రీం క్లీం చాముణ్ణాయై విచ్ఛే శ్రీ హ్రీం క్లీం గ్లౌన్ గన్ గణపతయే వర వరద్ సర్వజనం మే వష్మానాయ స్వాహా ఓం హ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం వరః-ముఖాయ దుః-స్థాన్-శూల్-వేతలాయ క్రీం శ్రీం స్వాహా ఐం హ్రీం శ్రీం క్లీం చాముణ్డయై విచ్ఛే.. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా దుర్గామాత అనుగ్రహం పొంది శక్తిని పొందుతారు. మరియు ఆమె వివిధ పూజలకు ఈ మంత్రాలు వివిధ రూపాల్లో ఉపయోగించబడతాయి. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా చండీ దేవి అనుగ్రహం పొంది అన్ని కష్టాల నుండి విముక్తి పొందుతారు. ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్నుండి జారీ చేయడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *