– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
-01వ డివిజన్ 001 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గురువారం 01 వ డివిజన్ 001 వ వార్డు సచివాలయం పరిధిలో స్థానిక కార్పొరేటర్ ఉద్ధంటి సునీతతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. గాంధీజీ కాలనీలో విస్తృతంగా పర్యటించి.. 225 గడపలను సందర్శించారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు సక్రమంగా అందుతున్నాయా లేదా..? ఆరా తీశారు. ముఖ్యమంత్రి సంతకం చేసిన సంక్షేమ బుక్ లెట్లను లబ్ధిదారులకు అందించారు. ప్రజలు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. నవరత్నాల ద్వారా పేద, బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో మేలు చేకూరిందని మల్లాది విష్ణు అన్నారు. వైఎస్సార్ ఆసరా, అమ్మఒడి, పేదలందరికీ ఇళ్లు, చేయూత, విద్యాదీవెన వంటి పథకాలతో ప్రజలలో సంతృప్తిస్థాయి విపరీతంగా పెరిగిందన్నారు. గడిచిన నాలుగేళ్లలో డీబీటీ, నాన్-డీబీటీ ద్వారా పేదలకు అక్షరాల రూ. 4 లక్షల కోట్ల లబ్ధిని చేకూర్చినట్లు తెలిపారు. ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో పేదరికం 11.77 శాతం నుంచి 6.06 శాతానికి తగ్గిందని వెల్లడించారు.
చేదోడు నాలుగో విడత ద్వారా 1,905 మందికి లబ్ధి
కష్టజీవులకు తోడుగా ఉండేందుకు జగనన్న చేదోడు పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని మల్లాది విష్ణు అన్నారు. నాలుగో విడత చేదోడు ద్వారా నియోజకవర్గంలో 1,905 మంది ఖాతాలలో రూ. 1,905 కోట్ల నిధులు జమ చేసినట్లు వెల్లడించారు. వీరిలో 443 మంది రజక., 167 మంది నాయీబ్రాహ్మణ., 1,295 మంది టైలర్ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు ఉన్నట్లు తెలిపారు. అలాగే తొలి విడత చేదోడు ద్వారా 2,051 మందికి రూ. 2.05 కోట్లు., రెండో విడతలో 1,570 మందికి రూ. 1.57 కోట్లు., మూడో విడతలో 1,891 మందికి రూ. 1.89 కోట్లు మొత్తంగా నాలుగేళ్లలో రూ. 7.41 కోట్లు చేతివృత్తుల వారికి మేలు చేకూర్చడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగపరచుకుని జీవనోపాధిని మెరుచుపరచుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి సంకల్ప బలానికి దైవబలం తోడవ్వాలి
ఆధ్యాత్మిక నగరంగా వెలుగొందుతున్న విజయవాడకు.. దసరా ఉత్సవాలతో మరింత శోభ వచ్చిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని శుక్రవారం అమ్మవారికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తూ.. 6 కోట్ల ప్రజల సుఖ:సంతోషాలకై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలతో రైతులు, సకల వృత్తులూ పరిఢవిల్లాలని.. నిరుపేదలు, సామాన్యులు సమాజంలోని ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో విరాజిల్లాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష అని మల్లాది విష్ణు తెలిపారు. ముఖ్యమంత్రి సంకల్ప బలానికి దైవబలం కూడా తోడవ్వాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీడీఓ జగదీశ్వరి, నాయకులు కొండా మహేశ్వరరెడ్డి, ఆళ్ల ప్రసాద్ రెడ్డి, ఉద్ధంటి సురేష్, బండి వేణు, యలమంద, ఆర్టీసీ శ్రీను, చంద్రశేఖర్, తుంగం ఝాన్సీ, రమణి, ఫాతిమా, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News