గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రైవేట్ వెంచర్లు లేదా లే అవుట్లు తగిన అనుమతులతోనే ఏర్పాటు చేసుకోవాలని, లేకుంటే పట్టణ ప్రణాళిక అధికారులు తొలగింపు చర్యలు తీసుకుంటారని నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ వాసవి నగర్ లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న లే అవుట్, శ్రీనగర్ లో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసిన అపార్ట్మెంట్ లను తనిఖీ చేసి తదుపరి అనుమతులపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వెంచర్లు అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తే సంబందిత ప్లానింగ్ కార్యదర్శి, పట్టణ ప్రణాళిక అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వెంచర్ల రోడ్ వైడెనింగ్ పోర్షన్, అంతర్గత రోడ్ల వెడల్పు, ప్లాట్ల కొలతలు, మార్ట్ గేజ్ ప్లాట్లు, యుటిలిటి ఏరియా, ఎమినిటీస్ ఏరియా, ఓపెన్ స్పేస్, గ్రీనరి, డ్రైన్ల ఏర్పాటుపై వివరాలు అడిగి తెలుసుకొని నేరుగా తనిఖీ చేశారు. అనంతరం పట్టణ ప్రణాలిక అధికారులతో కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబందనల మేరకే వెంచర్లకు అనుమతులు ఇవ్వాలని, తుది అనుమతుల కోసం తమకు పంపే ముందే ప్రణాళిక అధికారులు సదరు వెంచర్ లను సమగ్రంగా పరిశీలించి, ప్రభుత్వ నిర్దేశిత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబందనల మేరకు లేని వెంచర్లకు అనుమతులు మంజూరు చేయబోమన్నారు. అనంతరం శ్రీనగర్ లో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న భవనాన్ని పరిశీలించి, మాట్లాడుతూ నిబందనల మేరకు మాత్రమె నగరంలో బహుళ అంతస్తు భవనాలు నిర్మాణాలు జరగాలని, నిబందనలు ఉల్లంఘన చేస్తే తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఎల్.టి.పి.లు నూతనంగా బహుళ అంతస్తు భవనాలకు అనుమతుల కోసం ఆన్ లైన్ ద్వారా డిపిఎంఎస్ లో తప్పనిసరిగా నిర్దేశిత ధ్రువ పత్రాలు అప్ లోడ్ చేయాలని, లేకుంటే తదుపరి అనుమతులను నిలిపివేయడం జరుగుతుందన్నారు. మాస్టర్ ప్లాన్ ఎలైన్మెంట్ కాని, లేదా మాస్టర్ ప్లాన్ లో చేసిన భవన నిర్మాణాలకు ఆక్యుపెన్సీ అనుమతులు ఇవ్వబడవన్నారు. సెట్ బ్యాక్ పోర్షన్ లో, రోడ్ వైడినింగ్ పోర్షన్ లో ఎటువంటి నిర్మాణం చేసినా, నిర్ణీత ఎత్తు మించినా కూడా ఆక్యుపెన్సీ మంజూరు చేయబోమన్నారు. పర్యటనలో సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, డిప్యూటీ సిటి ప్లానర్ కోటయ్య, టిపిబిఓ రసూల్, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News