విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో పంటలకు నష్టం జరగకుండా రైతులు రెండు మూడు రోజుల పాటు వరికోతలను వాయిదా వేసుకోవాలని యిప్పటికే కోత కోసి కల్లాలలో వున్న ధాన్యాన్ని తక్షణమే లారీల్లో మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీ రావు అధికారులను ఆదేశించారు. మిచౌంగ్ తుఫాన్ వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీ రావు జాయింట్ కలెక్టర్ డా.పి.సంపత్ కుమార్ ఆదివారం క్షేత్రాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను కారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ఆయన మాట్లాడుతూ తుఫాను దృష్ట్యా జిల్లాలో వరి పండించిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు జాగ్రత్త చర్యలు సత్వరమే చేపట్టాలన్నారు. వర్షాల వలన పంట దెబ్బ తినకుండా రైతులు వరి కోతలను రెండు మూడు రోజులు వాయిదా వేసుకోవాలని కోరారు. రైతులు ఇప్పటికే వరి కోతలు కోసి వుంటే తక్షణమే ధాన్యాన్ని లారీలలో లోడ్ చేసి మిల్లులకు తరలించుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వర్షాలకు ధాన్యం తడిసి దెబ్బతిని రైతులు నష్టపోరాదని స్పష్టం చేశారు. తడిసి దెబ్బ తిని తేమ శాతం వున్నప్పటికీ ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగొలు చేసి రైతులను ఆదుకుంటామన్నారు. ఆర్డీవోలు తహసిల్దార్లు, వ్యవసాయ అధికారులు, కస్టోడియన్ అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు వరి కోతలు చేపట్టకుండా చర్యలు తీసుకోవటంతో పాటు కోసి సిద్ధం గా వున్న ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాలు, మిల్లులకు తరలించేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు అన్నారు.
Prajavartha Online Telugu News