-ఇటీవల మిచాంగ్ తుఫాన్ కు దెబ్బతిన్న వరి పంటలను అంతర్ మంత్రిత్వ బృందం పరిశీలించింది.
పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం మధ్యాహ్నం అంతర్ మంత్రిత్వ కేంద్ర బృందం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ న్యూఢిల్లీ నేతృత్వంలో సభ్యులు రాకేష్ కుమార్ , మహేంద్ర చండాలియా ( ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీం ) కృష్ణాజిల్లా విస్తృతంగా పర్యటించారు. కంకిపాడులో బ్యాంకు కాలనీ లోని రైతు భరోసా కేంద్రం 2 లో ఛాయాచిత్ర ప్రదర్శన ,పంటనష్టంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీక్షించారు. అనంతరం కంకిపాడు మండలం దావులూరు గ్రామంలో రైతు సాంబశివరావు పొలంలో పనలపై పడిపోయిన వరి పంటను చూశారు. వర్షం నీటిలో పంట ఒరిగిపోవడం చేత తీవ్రంగా నష్టపోయానని ఆ రైతు కేంద్ర బృందం వద్ద ఆవేదన వ్యక్తం చేశాదు. తనను ఆదుకోవాలని ఆ రైతు కేంద్ర బృందం వద్ద మొరపెట్టుకున్నాడు. అనంతరం పామర్రు మండలం నిమ్మలూరు గ్రామంలో ఆత్మూరి రామ కోటేశ్వరరావు తాను 20 ఎకరాల కౌలు రైతునని కేంద్ర బృంద సభ్యులకు తెలిపాడు తర్వాత గుడివాడ మండలంలో రామనపూడి గ్రామానికి వెళుతూ, దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. రోడ్లపై ధాన్యాన్ని ఆరపెట్టుకుంటున్న రైతు గొరిపర్తి వెంకటేశ్వరరావుతో మాట్లాడారు. గత నాలుగు రోజుల నుంచి వస్తున్న ఎండను బట్టి వడ్లలో తేమ శాతాన్ని తగ్గించుకునేందుకు ఆరబెట్టుకున్నానని రేపు రైతు భరోసా కేంద్రానికి ధాన్యం లోడు తీసుకు వెళ్తున్నానని రైతు తెలిపారు. అక్కడే దెబ్బతిన్న వరి పంట పొలాలను కేంద్ర బృందం పరిశీలించి రైతులతో ముఖాముఖి పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు వరిపంట ఎక్కువగా చేతికి వచ్చే దశలో దెబ్బతిందని పలువురు రైతులు కేంద్ర బృంద సభ్యుల వద్ద మొరపెట్టుకొని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అంతర్ మంత్రిత్వ కేంద్ర బృందం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ
స్థానిక మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, పంట నష్టం అంచనాలు రూపొందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేమని, తొలి రోజున కృష్ణాజిల్లాలో బుధవారం పర్యటిస్తున్నామని చెప్పారు. తాము పర్యటించిన పలు ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాల్లో నీరు నిలిచి ఉన్నందున జిల్లా యంత్రాంగం ఇప్పటికే పంట నష్టం అంచనా వేయడానికి ఎన్యుమురేషన్ చేపట్టిందని ఆ ప్రక్రియ పూర్తయ్యాక సరైన పంట నష్ట అంచనాలు అందుతాయని దాని ఆధారంగా సంపూర్ణ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని, నష్టపోయిన రైతులను నిబంధనల మేరకు ఆదుకోవాలని తాము సిఫార్సు చేస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు, పామర్రు శాసనసభ్యులు కొలుసు పార్థసారథి, కైలే అనిల్ కుమార్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ జన్ను రాఘవరావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి ఉయ్యూరు ఆర్డిఓ, జిల్లా మేనేజర్ సివిల్ సప్లై ఇంచార్జ్ డి రాజు, జిల్లా ఉద్యాన అధికారి జే జ్యోతి, జిల్లా విద్యుత్ శాఖ అధికారి భాస్కరరావు, జిల్లా ఆర్ అండ్ బి అధికారి శ్రీనివాసరావు, ఎస్ ఈ పంచాయతీరాజ్ విజయకుమారి, స్థానిక ప్రజాప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News