– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-30 వ డివిజన్ 251 వ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 30 వ డివిజన్ 251 వ వార్డు సచివాలయ పరిధిలో బుధవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. దేవీనగర్ 5, 6, 7, 8 లైన్లలో విస్తృతంగా పర్యటించి.. 235 గడపలను సందర్శించారు. పేదలకు నవరత్నాల కార్యక్రమాల ద్వారా చేకూరిన లబ్ధిని సంక్షేమ బుక్ లెట్ల ద్వారా వివరించారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల హృదయాలలో సుస్థిరంగా, చెరగని ముద్ర వేసుకుంటున్నాయని మల్లాది విష్ణు అన్నారు. అది చూసి ఓర్వలేక ఈ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయని.. ఇటువంటి సమయంలో మంచి చేస్తున్న ముఖ్యమంత్రికి అండగా నిలవాలని కోరారు. తమను గెలిపించిన ప్రజలకు చేసిన మంచిని గడప గడపకు వెళ్లి తాము చెప్పగలమని.. టీడీపీ హయాంలో పేదలకు ఏం చేశారో చెప్పే ధైర్యం గత పాలకులకు ఉందా..? అని సూటిగా ప్రశ్నించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి విశేష కృషి
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతంలో పెనుమార్పు వచ్చిందని మల్లాది విష్ణు అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని.. కానీ ఈ ప్రభుత్వంలో దాదాపు రూ. 23 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. కేవలం రోడ్ల నిర్మాణానికే రూ. 9 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. జీవీఆర్ నగర్ లో అమృత్ పథకంలో భాగంగా రూ. 6.10 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సంపు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాల దృష్ట్యా దావు బుచ్చయ్య కాలనీలో రూ. 3.30 కోట్ల అంచనాలతో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. అలాగే గంగిరెద్దుల దిబ్బ నుంచి జీవీఆర్ నగర్ వాటర్ ట్యాంక్ వరకు రూ. 3.29 కోట్ల వ్యయంతో 400mm మంచి నీటి సరఫరా పంపింగ్ మెయిన్ పనులు చురుగ్గా జరుగుతున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే రూ. 5 కోట్ల వ్యయంతో రాబోయే పదేళ్లకు సరిపడా 33 కె.వి. సబ్ స్టేషన్ ను కూడా ఈ ప్రాంతంలో ప్రారంభించుకున్నట్లు మల్లాది విష్ణు గుర్తు చేశారు. రామకృష్ణాపురం నుంచి దేవీనగర్ వరకు ప్రధాన రహదారిని పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రూ. కోటి 20 లక్షల వ్యయంతో నిర్మించి ఇటీవల ప్రారంభించుకున్న దేవీనగర్ అర్బన్ హెల్త్ సెంటర్ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నట్లు వివరించారు. సంక్షేమాభివృద్ధిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరెవరూ సాటిరారని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో నాయకులు మార్తి చంద్రమౌళి, పవన్ కుమార్ రెడ్డి, సుబ్బారెడ్డి, నారాయణ రెడ్డి, నగర ప్రసాద్, డి.కృష్ణా, ముత్యాలు, సామంతకూరి దుర్గారావు, ఎస్.రామకృష్ణ, పవన్, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News