గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కార్పోరేటర్ల నుండి అందే ఫిర్యాదులు, ఆర్జీల పరిష్కారం పై వార్డ్ ల వారిగా నివేదిక ఇవ్వాలని విభాగాదిపతులకు నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. శుక్రువారం కమిషనర్ ఛాంబర్ లో నగరంలోని కార్పొరేటర్లతో వార్డ్ ల్లో అభివృద్ధి పనులు, స్థానిక సమస్యల పై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రజా ప్రతినిధులు ప్రజలతో మమేకమై ఉంటారని, వారు గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కారనికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వార్డ్ ల వారిగా కార్పొరేటర్లు అందించిన అర్జీలు, వాటి పరిష్కారం పై నివేదిక ఇవ్వాలని ఆయా విభాగాదిపతులను ఆదేశించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసినప్పుడే ప్రజా సమస్యలు పరిష్కారం, నగర సమగ్రాభివ్రుద్ది జరుగుతుందన్నారు. వార్డ్ ల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనుల పై కార్పొరేటర్లు కూడా కమిషనర్ తో చర్చించడానికి ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా సమయం కేటాయించడం జరిగిందన్నారు. మిగిలిన రోజుల్లో కూడా కార్పొరేటర్లకు అందుబాటులో ఉంటామని, వాట్స్ అప్ లో సమస్యలు తెలిపినా కూడా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్పొరేటర్ల నుండి అందే అర్జీలు, ఫిర్యాదులు, ప్రతిపాదనలను క్రమ పద్దతిలో రికార్డ్ చేసి, తదుపరి చర్యలు కూడా వారికి తెలిపేలా అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News