Breaking News

వినియోగదారుల హక్కుల పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం

-వినియోగదారుల విస్తృత ప్రయోజనాలు, సత్వర న్యాయం కోసం చట్ట సవరణ
-ఇకపై ఇంటి నుండే వినియోగదారుల ఫోరంలో కేసు దాఖలు
-రూ.5 లక్షల వరకు నష్టపోయిన వస్తువు మీద చేసే ఫిర్యాదులు ఉచితం.. రూ.5 లక్షలు- రూ.10 లక్షల వరకు రూ.200, రూ.10 లక్షలు- రూ.20 లక్షల వరకు రూ.400, రూ.20 లక్షలు- రూ. 50 లక్షల వరకు నష్టపోయిన వస్తువు విషయంలో ఫిర్యాదు చేసేందుకు రూ.1000 రుసుము
-వినియోగదారులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయిలో ప్రచారం
-1967 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటుతో పాటు పాఠశాలలు, కళాశాలలు, డిగ్రీ కాలేజీల్లో వినియోగదారుల క్లబ్ లు ఏర్పాటు
-కొన్న ప్రతి వస్తువు నాణ్యతను పరిశీలించాలని, మోసపూరిత ప్రకటనలకు ఆకర్షితులు కావొద్దని, కొన్న వస్తువులకు తప్పనిసరి సరైన బిల్లులు తీసుకోవాలని సూచన
-రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి డా. కారుమూరి వెంకట నాగేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినియోగదారుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి డా. కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం-2023 (ఇతివృత్తం:- ఈ-కామర్స్ మరియు డిజిటల్ వర్తక శకంలో వినియోగదారుల రక్షణ) సందర్భంగా ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు కల్పిస్తున్న హక్కులు, రక్షణ గురించి, శాఖలు, సంఘాల ద్వారా అందిస్తున్న సేవల గూర్చి వివరించారు. ప్రతి ఏటా డిశెంబర్ 24న జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పండుగలా జరుపుకోవడం ఆనందంగా ఉందని మంత్రి అన్నారు. సమాజంలో ప్రతి వ్యక్తి వినియోగదారుడేనని, నాణ్యమైన, సరైన పరిమాణంలో సరసమైన ధరలకు వస్తువులు పొందే హక్కు వినియోగదారునికి ఉందన్నారు. వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉంటే నష్టపోకుండా ముందస్తుగా జాగ్రత్త పడవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా వినియోగదారులకు తమ హక్కులు, బాధ్యతలు, చట్టాలపై అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. 6,000 పాఠశాలలు, 500 ఇంటర్మీడియట్ కళాశాలలు, 175 డిగ్రీ కాలేజీల్లో వినియోగదారుల క్లబ్ లు ఏర్పాటు చేశామన్నారు.

వినియోగదారులు కొన్న ప్రతి వస్తువు నాణ్యతను పరిశీలించాలని, మోసపూరిత ప్రకటనలకు ఆకర్షితులు కావొద్దని, కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు, పొందిన సేవలకు తప్పనిసరి బిల్లులు పొందాలని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సూచించారు. డిజిటల్ యుగంలో వినియోగదార్ల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అనేక సవరణలతో వినియోగదారుల పరిరక్షణ కోసం -2019 తీసుకొచ్చిందన్నారు. వినియోగదారులు ఏదైనా వస్తువును ఏ ప్రాంతంలో కొనుగోలు చేసినా స్థానిక జిల్లా కమిషన్ లోనే ఫిర్యాదు చేసుకునే వెసులుబాటుతో పాటు విచారణ కోసం నేరుగా వినియోగదారుల కమిషన్ లకు రాలేని ఫిర్యాదుదారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొనే సౌలభ్యాన్ని కల్పించేలా చట్ట సవరణ చేశామన్నారు. వస్తువు నాణ్యతలో, పరిమాణంలో తేడాలుంటే ఇంటి నుండే ఆన్ లైన్ ద్వారా కేసు వేసేందుకు అవకాశం కల్పించామన్నారు. తద్వారా వినియోగదారులకు దూరాభార ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. కాలం వృథా కాదని తెలిపారు.

డిజిటల్ యుగంలో చాలా మోసాలు జరుగుతున్నాయని మంత్రి చెబుతూ పెట్రోల్ బంక్ లు, మాల్స్, వేబ్రిడ్జి, ఎరువుల షాపులు, స్వీట్ షాపులు, బంగారం కొట్లు, గ్యాస్ గోడౌన్ లు తదితర వాటిల్లో జరుగుతున్న మోసాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. వెంటనే వాటిపై నిఘా ఉంచి అక్రమాలను వెలికితీసి 4 కోట్ల 52 లక్షల జరిమానా విధించి సంబంధిత బాధితులకు అందజేశామన్నారు. పలు సంస్థలు, వ్యక్తులపై రాజీలేకుండా కేసులు నమోదు చేశామన్నారు. ఫోన్ లకు వచ్చే ఓటీపీని ఎవరితోనూ పంచుకోవద్దని చెప్పిన మంత్రి ఓటీపీ చోరీ చేసే ముఠాపై నిఘాపెట్టామన్నారు. ఇప్పటికే చాలా కేసుల్లో పలువురిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ సందర్భంగా తణుకులో పదకొండున్నర కేజీల బంగారం చోరీ అంశాన్ని ప్రస్తావిస్తూ మహారాష్ట్రకు చెందిన ఓ గ్యాంగ్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు సినీ ఫక్కీలో చాకచక్యంగా పట్టుకొని రికవరీ చేసిన విధానాన్ని వివరించారు.

రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖను బలోపేతం చేశామని మంత్రి తెలిపారు. వినియోగదారులకు, వర్తకదారులకు వారథిగా ఉన్న కన్య్జూమర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ను, వారి సేవలను ఈ సందర్భంగా మంత్రి అభినందిస్తూ కొనియాడారు. లీగల్ అండ్ మెట్రాలజీ, రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించేందుకు త్వరలో ఒక బృందాన్ని ఏర్పాటుచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు.

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ వినియోగదారుల చట్టాలు, హక్కులపై వినియోగదారులకు అవగాహన తప్పనిసరన్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా, నేరుగా ఉపయోగపడే శాఖ పౌర సరఫరాల శాఖ అని తెలిపారు. ఈ శాఖ బలోపేతం కోసం గౌరవ ముఖ్యమంత్రి అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. బ్లాక్ మార్కెట్ నిర్మూలనకు, ధరలను అదుపులో ఉంచేందుకు ఈ శాఖ తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.

రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్ మాట్లాడుతూ వినియోగదారుల చట్టంపై అవగాహన లేకపోవడం వల్లే మోసాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్క వినియోదారుడికి చట్టం, హక్కులపై అవగాహన ఉంటే వజ్రాయుధంగా పనిచేస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న విలేజ్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ కు ఈ అంశంపై అవగాహన కల్పించి తద్వారా వినియోగదారులకు అవగాహన కలిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వినియోగదారులకు హక్కులు, అవగాహన కల్పించే విషయానికి సంబంధించి ఇటీవల వైజాగ్ లో నిర్వహించిన కన్జ్యూమర్ నేషనల్ కాంక్లేవ్ లో పలువురు వక్తలు రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై కితాబిచ్చారన్నారు.

రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్, ఐఏఎస్ ఎం. విజయ సునీత మాట్లాడుతూ మెరుగైన సమాజానికి పునాదులు వేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. విద్యార్థి దశ నుంచే వినియోగదారుల చట్టంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. పోస్టర్లు, సోషల్ మీడియా, యూట్యూబ్ లలో ప్రచారం, ప్రభుత్వ రేషన్ వాహనాలపై చట్టాల సమాచారం పొందుపరచడం, ర్యాలీలు చేపట్టడం, వినియోగదారుల క్లబ్ ల ద్వారా యువత, మహిళలు, విద్యార్థులకు చేరే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. వస్తువు నాణ్యతలో, పరిమాణంలో లోపాలుంటే వినియోగాదారులు 1967 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ఈ సందర్భంగా మొట్టమొదటగా భారతదేశంలో వినియోగదారుల ప్రయోజనాలు, వారి హక్కుల సంరక్షణ కోసం వినియోగదారుల రక్షణ చట్టం -1986 వచ్చిందని వివరించారు. కాలనుగుణంగా డిజిటల్ యుగం వచ్చిందని, తదనుగుణంగా వ్యాపార విధానాలలో, మార్కెట్ వ్యవస్థలో చోటు చేసుకున్న మార్పుకనుగుణంగా వినియోగదారుల రక్షణ చట్టం -2019 రూపొందించడం జరిగిందన్నారు.

ఎన్టీఆర్ జిల్లా వినియోగదారుల ఫోరమ్ అధ్యక్షులు ఎన్. చిరంజీవి మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 17 డిస్ట్రిక్ట్ కోర్టులున్నాయన్నారు. ప్రస్తుతం జిల్లా వినియోగదారుల కమిషన్ గా పిలవబడుతున్న కోర్టుల్లో కేవలం ఏడాదిన్నర కాలంలోనే 1200 కేసులు పరిష్కరించి 2 కోట్ల రూపాయలను బాధితులకు పరిహారంగా ఇప్పించామన్నారు. వినియోగదారులతో స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పామన్నారు. రూ.5 లక్షల వరకు నష్టపోయిన వస్తువు మీద ఫిర్యాదు చేసేందుకు వినియోగదారులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు రూ.200, రూ.10 లక్షల నుండి రూ.20 లక్షల వరకు రూ.400, రూ.20 లక్షల నుండి రూ. 50 లక్షల వరకు నష్టపోయిన వస్తువు విషయంలో ఫిర్యాదు చేసేందుకు రూ.1000 రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. వస్తువు కొనుగోలు చేసినప్పుడు నాణ్యత లేదనో, ధర ఎక్కువగా తీసుకున్నారనో, ఎక్స్ పైర్ డేట్ గడిచిందనో, తూకంలో తేడా ఉందని నిర్ధారణకు వచ్చినప్పుడు వినియోగదారుల ఫోరంలో నేరుగా లేదా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలని సూచించారు.

ఆన్ లైన్ షాపింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ కు చెందిన విద్యార్థినులు స్కిట్ రూపంలో ప్రదర్శించిన తీరు ఆహుతులను ఆకట్టుకోవడమే గాక ఆలోచింపజేసింది. కార్యక్రమం అనంతరం వినియోగదారుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా, శాఖ సాధించిన విజయాలు గూర్చిన సమాచారంతో పౌరసరఫరాల శాఖ ద్వారా ద్వారా రూపొందించిన మేలుకొలుపు మాసపత్రికను మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఇతర అతిథులు కలిసి ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలు, పాఠశాలల్లో వినియోగదారుల హక్కులపై విద్యార్థులకు నిర్వహించిన క్విజ్‌, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషగిరి రావు, రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్, డైరెక్టర్, ఐఏఎస్ ఎం. విజయ సునీత, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పి. సంపత్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా వినియోగదారుల ఫోరమ్ అధ్యక్షులు ఎన్. చిరంజీవి, రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *