-సామాజిక భద్రతకు మరింత భరోసా..
-2023, డిసెంబర్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 2,36,041 మందికి రూ. 65.53 కోట్ల లబ్ధి
-జిల్లాలో 2,02,720 మందికి రూ. 3 వేలకు పెన్షన్ పెంపు ద్వారా లబ్ధి
-2024, జనవరిలో మరో 3,173 కొత్త పెన్షన్లు మంజూరు
-ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతంగా నిలుస్తూ ప్రజా సంక్షేమం, అభివృద్ది లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు కింద సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలుచేస్తోందni.. ఈ క్రమంలోనే పెన్షన్ మొత్తాన్ని రూ. 3000కు పెంచడం ద్వారా వృద్ధులు, వితంతువులు తదితరుల సామాజిక భద్రతకు మరింత భరోసా కల్పిస్తోందని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో భాగంగా పెన్షన్ మొత్తాన్ని రూ. 3 వేలకు పెంచి ఇచ్చే కార్యక్రమాన్ని బుధవారం కాకినాడలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వర్చువల్గా కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి కలెక్టర్ ఎస్.డిల్లీరావు.. అధికారులు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు తదితరులతో కలిసి హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ డిల్లీరావు.. డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ తోలేటి శ్రీకాంత్, డీసీఎంఎస్ ఛైర్పర్సన్ పడమట స్నిగ్ధ, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ టి.చంద్రశేఖర్ తదితరులతో కలసి లబ్ధిదారులకు పెన్షన్ పెంపు మెగా చెక్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ పెన్షన్ కానుక మొత్తాన్ని రూ. 3 వేలకు పెంచి, లబ్ధిదారులకు అందించే కార్యక్రమం జనవరి 1 నుంచి 8 వతేదీ వరకు పండగ వాతావరణంలో జరుగుతోందన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 2023, డిసెంబర్లో ఎన్టీఆర్ జిల్లాలో వృద్ధాప్య, వితంతు, నేత కార్మికులు, మత్స్యకార, డప్పు కళాకారులు తదితర 17 కేటగిరీల్లో 2,36,041 మందికి రూ. 65.54 కోట్లు అందించడం జరిగిందని.. జనవరి 1 నుంచి వృద్దాప్య, వితంతు, నేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు తదితర ఏడు కేటగిరీలకు చెందిన 2,02,720 మందికి రూ. 3 వేలకు పెంపు వర్తిస్తుందని వివరించారు. ఈ పెంపు ద్వారా రూ. 5.06 కోట్ల మేర అదనపు లబ్ధి జరగనుందన్నారు.
2019 నుంచి మంజూరు చేసిన కొత్త పెన్షన్లు 57,378:
జిల్లాలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 2019, జూన్ నుంచి ఇప్పటి వరకు చూస్తే మొత్తం 57,378 కొత్త పెన్షన్లు మంజూరయ్యాయని.. వీటిద్వారా రూ. 45.94 కోట్ల మేర లబ్ధి జరుగుతోందని కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. 2024, జనవరిలో 3,173 కొత్త పెన్షన్లు మంజూరయ్యాయని.. వీటిద్వారా లబ్ధిదారులకు రూ. 95.19 లక్షల మేర లబ్ధి జరగనుందని తెలిపారు. జిల్లాలో దివ్యాంగ, డయాలసిస్, కళాకారులు, డప్పు కళాకారులు తదితర పెన్షన్లకు సంబంధించి 33,321 మందికి రూ. 9.78 కోట్ల మేర లబ్ధి జరుగుతోందని వివరించారు. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో విప్లవాత్మకంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం అమలవుతోందని.. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయాన్నే లబ్ధిదారులకు పెన్షన్ మొత్తం అందుతోందన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలు, వాలంటీర్ వ్యవస్థలు ఈ బృహత్ కార్యక్రమాన్ని సజావుగా అమలుచేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. ఈ పెన్షన్ మొత్తం వృద్ధులు, వితంతువులు, నేత కార్మికులు, మత్స్యకారులు తదితరులు సమాజంలో గౌరవంగా బతికేందుకు ఉపయోగపడుతోందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేస్తోందని.. ఎవరైనా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు త్వరితగతిన వెరిఫికేషన్ పూర్తిచేసి పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
లబ్ధిదారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ:
ఈ పెన్షన్ పెంపుతో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని 100 శాతం అమలు చేశాను.. ప్రతి నెలా పెన్షన్లు అందుకుంటున్నవారి సంఖ్య దాదాపు 66 లక్షలు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. గతంలో మాదిరి కాకుండా ప్రతి నెలా 1వ తేదీన.. అది ఆదివారమైనా.. మరే ఇతర సెలవు రోజైనా కూడా సూర్యోదయంతోనే మీ ఇంటి తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెపుతూ మన వాలంటీర్లు మీకు పెన్షన్ అందిస్తున్నారు. పెన్షన్ కోసం పడిగాపులు పడి, ఎక్కడో ఉన్న కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. దేశంలో రూ. 3000 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన రాష్ట్రమంటూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లేఖలను కలెక్టర్ డిల్లీరావు లబ్ధిదారులకు అందజేశారు.
కార్యక్రమంలో డీఆర్డీఏ అధికారులు, సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News