-ఈవియం లపై విస్తృత అవగాహన కల్పిస్తున్నాం…
-తుది దశకు చేరుకున్న ఎస్ఎస్ఆర్-2024 కార్యకలాపాలు
-జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024లో భాగంగా క్లెయిమ్‌లు, ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తు తుది ఓటర్ల జాబితా రూపొందిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. నగరంలోని కలెక్టరేట్ ఛాంబర్ లో బుధవారం జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, డిఆర్వో ఎస్. వి. నాగేశ్వరరావు లతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ- 2024 కార్యక్రమంలో భాగంగా నమోదవుతున్న దరఖాస్తుల పరిష్కారంపై చర్చించారు. సమావేశంలో జిల్లాలో నేటి వరకు నమోదైన ఫారమ్-6, 7, 8 దరఖాస్తుల పరిశీలన, పరిష్కార ప్రగతిని రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఓటరు జాబితా స్వచ్చీకరణలో భాగంగా రాజకీయ పార్టీలు గత సమావేశాలలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను వివరించారు. 2023, జనవరి 5వ తేదీ నుండి నేటివరకు అందిన మొత్తం 5 లక్షల 23 వేల 777 దరఖాస్తులు నమోదుకాగా వీటిలో 4 లక్షల 85 వేల 701 దరఖాస్తులను అంగీకరించి ఇ రోల్ ల్లో అప్ డేట్ చేశామన్నారు. వీటిలో అర్హత లేని 24,082 దరఖాస్తులను తిరస్కరించగా ఇంకను పరిష్కరించాల్సినవి 10,290 మాత్రమే ఉన్నాయన్నారు. జిల్లాలో 18 సంవత్సరాల వయస్సు నిండి కొత్తగా ఓటు హక్కుకు అర్హత పొందిన యువతను ఓటర్ల నమోదుకు చైతన్యపరస్తూ చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ వివరాలను తెలిపారు. జిల్లాలో 2024 ప్రొజెక్టెడ్ పాపులేషన్ ప్రకారం 18 నుండి 19 సంవత్సరాల వయస్సు కలిగిన 96,902 మందిని ఓటర్ల నమోదు చేసేందుకు పెద్దఎత్తున స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల తో ఓటు వేసే విధానంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు ముఖ్యంగా నగరపాలక సంస్థ పరిధిలోని మూడు నియోజకవర్గాలలో నమూనా ఈవియంలతో ఓటు వేసే విధానాన్ని ప్రతి ఒక్కరికి వివరిస్తున్నామన్నారు. ఈ నెల 22న తుది ఓటర్ల జాబితా ప్రచురణకు సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ ఢిల్లీరావు రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. సమావేశంలో బీజేపీ ప్రతినిధి పీవీ శ్రీహరి, బీఎస్పీ ప్రతినిధి ఎం.వినోద్ కుమార్, సీపీఐ (ఎం) డీవి కృష్ణ , ఐఎన్‌సీ ప్రతినిధి వై.ఏసుదాస్, టీడీపీ ప్రతినిధి ఎల్.శివరామప్రసాద్, వైఎస్ఆర్ సీపీ ప్రతినిధి వై.ఆంజనేయరెడ్డి, కలెక్టరేట్ ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ సీహెచ్ దుర్గాప్రసాద్ ఉన్నారు.
Prajavartha Online Telugu News