-వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవంలో విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ
-సమగ్ర శిక్ష వెబ్ సైట్ లాంఛనంగా ప్రారంభించిన విద్యాశాఖామాత్యులు
-‘జ్ఞాన జ్యోతి’, ‘జ్ఞాన ప్రకాష్’ రోజుల కోర్సు కార్యక్రమాల నిర్వహణకు ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో ఒప్పందం.
-సంకల్ప ప్రాజెక్టు నిమిత్తం మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ కుదుర్చుకున్న ఒప్పందం.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర విద్యారంగాన్ని దేశంలోనే మేటి వ్యవస్థగా రూపొందించాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకు వస్తున్న సంస్కరణలు విజయవంతంగా అమలు కావడంలో అధికారులందరూ చురుకుగా, సమిష్టిగా పనిచేయడం అభినందనీయమన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా మన రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలను ఆసక్తిగా గమనించడంతోపాటు, కేంద్ర ప్రభుత్వం కూడా అనేక అంశాలకు మన రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా తీసుకోవాలంటూ సూచించడం రాష్ట్ర విద్యా రంగానికి గర్వకారణమన్నారు.
విజయవాడ సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నాడు వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కమ్యూనిటీ సైన్స్ విభాగం తోడ్పాటుతో , పాఠశాల విద్యా శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ లు సంయుక్తంగా అంగన్ వాడీ టీచర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో 1,2 తరగతులకు బోధించే టీచర్లకు ‘జ్ఞాన జ్యోతి’ 120 రోజుల కోర్సు, ‘జ్ఞాన ప్రకాష్’ 60 రోజుల కోర్సు కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన ఎంఒయు పై మంత్రిగారి సమక్షంలో అధికారులు సంతకం చేశారు. అదే విధంగా పాఠశాల విద్యా శాఖకు సంబంధించిన సమాచారమంతా ఒకే వేదికపై నుంచి పూర్తి పారదర్శకంగా అందరికీ అందుబాటులో ఉండేలా రూపొందించిన సమగ్ర శిక్ష కొత్త వెబ్ సైట్ ను మంత్రి ప్రారంభించారు.
అలాగే 6-8 వ తరగతి వరకు చదవుతున్న విద్యార్ధుల కోసం నిర్దేశించిన సంకల్ప ప్రాజెక్టు మాడ్యూళ్లను, సీడీ మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ నూతన విద్యా విధానం ప్రకారం 3 ఏళ్ల నుంచి 8 వరకు వయస్సున్న పిల్లల్లోని అభ్యసనా సామర్ధ్యాలకు (లెర్నింగ్ స్కిల్స్ కు) అనుగుణంగా మంచి పునాదులు పడేట్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు.
డిజిటల్ యుగంలో, పాఠశాల విద్యా శాఖకు సంబంధించిన సమాచారమంతా, రోజువారీ కార్యక్రమాలతో సహా ప్రపంచానికంతటికీ తెలియచేసేలా, సమగ్ర శిక్ష ద్వారా నూతన వెబ్ సైట్ ను రూపొందించడం చాలా సంతోషమన్నారు. పిల్లల్లో అభ్యాసనా సామర్ధ్యం ఎక్కువగా ఉండే 3-8 ఏళ్ల వయసుల్లోని పిల్లలకు బోధించాల్సిన అంశాలపై అంగన్ వాడీ టీచర్లకు, ప్రభుత్వ పాఠశాలల్లో 1,2 తరగతుల టీచర్లకు శిక్షణా తరగతులను నిర్వహించడం చాలా ముదావహమన్నారు. ఇలా పలు రకాలుగా రాష్ట్రంలోని సుమారు 70 లక్షల మంది విద్యార్దుల ప్రయోజనాలే పరమార్థంగా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు.
పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ కొత్త వెబ్ సైట్ అనేది అటు ప్రజలకు, అధికారులకు అనుసంధాన కర్తగా ఉండటమే కాకుండా, పరిపాలనా పరంగా కూడా అనేక ప్రయోజనాలు కల్పించేదిగా రూపొందించారన్నారు. సంకల్ప ప్రాజెక్టు నిమిత్తం మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ తో కుదుర్చుకున్న ఒప్పందంతో, కౌమార దశలో ఉన్న విద్యార్ధుల్లో మానసిక, శారీరక వృద్ధితోపాటు, ఆలోచనా విధానం, సమస్యలు ఎదురైనప్పుడు సమర్ధంగా ఎదుర్కొనేట్లుగా శిక్షణా కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ IAS., ఇంటర్మీడియెట్ బోర్డు కమీషనర్, సెక్రటరీ సౌరబ్ గౌర్ IAS., స్త్రీ శిశు సంక్షేమశాఖ కమీషనర్ ఎం.జానకి IAS., సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., ఎండిఎం స్పెషల్ అధికారిణి శ్రీమతి శోభిక ఎస్.ఎస్. IAS., ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డా. శారదా జయలక్ష్మి.ఆర్, రిజిస్ట్రార్ డా. జి.రామారావు, డీన్, ఫ్యాకల్టీ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ డా. ఎల్.ప్రశాంతి, పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, ఎస్సీఈఆర్టీ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News