-అటవీ మరియు వన్య ప్రాణుల రక్షణలో సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలి
-అటవీ మరియు వన్యప్రాణికి హాని తలపెడితే చట్ట పరమైన చర్యలు: జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
అటవీ మరియు వన్య ప్రాణుల రక్షణ మన అందరి బాధ్యత అని, వాటికి హాని తలపెడితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల సమన్వయంతో అటవీ మరియు వన్య ప్రాణుల రక్షణ సుసాధ్యం అని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డి అన్నారు.
శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జిల్లా అటవీ మరియు వన్య ప్రాణుల రక్షణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన చైర్మన్ హోదాలో అటవీ శాఖ, రెవెన్యూ, పోలీస్ తదితర సంబంధిత అధికారులతో కలిసి నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ మరియు వన్య ప్రాణుల రక్షణ మన అందరి బాధ్యత అని, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల సమన్వయంతో ఇది సుసాధ్యం అని తెలిపారు. ముందుగా అజెండా మేరకు అంశాలపై కమిటీకి డి ఎఫ్ ఓ సతీష్ రెడ్డి వివరిస్తూ ఎక్కువగా భూ సంబంధిత సమస్యలు, భూ హద్దుల సమస్యలు ఉన్నాయని తెలుపగా, సమస్య పరిష్కారానికి రెవెన్యూ యంత్రాంగం, అటవీ శాఖ సమన్వయంతో సంయుక్తంగా తనిఖీ చేసి పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అలాగే పాకాల, చిన్నగొట్టిగల్లు ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నాయని తెలుపగా వాటిని ట్రాకర్స్ ద్వారా పర్యవేక్షిస్తూ, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని తెలిపారు. అలిపిరి కాలి నడక దారిలో గత ఆగస్టు నెలలో జరిగిన దుర్ఘటన నాటి నుండి 6 చిరుత పులులను పట్టుకున్నామని, అలిపిరి కాలినడక ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, టీటీడీ సహకారంతో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారి సూచనల మేరకు టీటీడీ వారు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది అని, పోలీస్ మరియు ఎస్టీఎఫ్ అధికారుల సహకారంతో అటవీ శాఖ అధికారులు ఎర్ర చందనం స్మగ్లింగ్ అరికట్టడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
అటవీ చట్టం మేరకు, ప్రభుత్వ నిబంధనల మేరకు రెవెన్యూ రికార్డ్ లలో రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో పరిశీలించి అప్డేషన్ కొరకు చర్యలు చేపడతామని, అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్, చట్ట విరుద్ధంగా ఆక్రమిత స్థలాలపై పరిశీలన చేసి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. అటవీ శాఖ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వారి సూచనల మేరకు గ్రామ స్థాయిలో ఫైర్ అలర్టింగ్ సిస్టం ఏర్పాటు కొరకు గ్రామ సచివాలయం సిబ్బంది వివరాలు మండల అధికారులు అందజేస్తే వారి యొక్క సేవలు ఫైర్ అలెర్ట్ సిస్టమ్ లో వినియోగించుకుని అటవీ శాఖ,ఫైర్ తదితర అధికారుల సమన్వయంతో అటవీ ప్రాంతం అగ్నిబారిన పడితే వెంటనే ఆర్పివేసేలా సత్వరమే చర్యలు తీసుకోవచ్చని తద్వారా అటవీ, వన్య ప్రాణులను కాపాడటమే కాకుండా దగ్గరలోని గ్రామాలు అగ్ని జ్వాలల బారిన పడకుండా కాపడినవారం అవుతామని, పులికాట్ సరస్సు జీవ వైవిధ్యానికి, ప్రకృతి సమతుల్యతకు వివిధ రకాల పక్షులు, చేపలు ఇతర జీవరాశులకు ఆలవాలం అని, సుదూర ప్రాంతాల నుండి వచ్చే వివిధ జాతుల పక్షులకి పులికాట్ ఒక ఆవాసం అని, అందులో ఫ్లెమింగో పక్షులు, పెలికాన్ తదితర పక్షులు సందర్శకులను ఎంతో ఆకట్టుకుంటాయని పులికాట్ సంరక్షణ ఆవశ్యకత బ్లడ్ వార్మ్స్ అక్రమ రవాణా అరికట్టాల్సిన ఆవశ్యకతపై అధికారులు వివరించగా కలెక్టర్ మాట్లాడుతూ సానుకూలంగా స్పందించి, పులికాట్ సంరక్షణకు సంబంధిత శాఖలు అన్ని విధాల చర్యలు చేపట్టాలని, అటవీ చట్ట విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే నిబంధనల మేరకు చర్యలు ఉంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ పెంచల్ కిషోర్, అదనపు ఎస్పి విమల కుమారి, డి ఎఫ్ ఓ, వైల్డ్ లైఫ్ సూళ్లూరుపేట శామ్యూల్, ఫ్లయింగ్ స్క్వాడ్ శివకుమార్, సబ్ డీఫ్ఓ శ్రీనివాస్, పోలీస్ అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News