– రైతు గ్రూపులు ఈ-మార్కెటింగ్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
– రైతు ఉత్పత్తిదారుల సంస్థల ప్రత్యేక మేళాను సందర్శించి రైతులను ప్రోత్సహించాలి
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధునిక సాంకేతిక ప్రపంచంలో అందుబాటులో ఉన్న డిజిటల్ మార్కెటింగ్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రైతులు సుస్థిర ఆదాయాన్ని పొందొచ్చని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు.
విజయవాడ మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో నాబార్డు ఏపీ ప్రాంతీయ కార్యాలయం.. స్మాల్‌ఫార్మర్స్ అగ్రీ బిజినెస్ కన్సార్టియం (ఎస్ఎఫ్ఏసీ), ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) భాగస్వామ్యంతో తరంగ్ పేరుతో ఏర్పాటుచేసిన రైతు ఉత్పత్తిదారుల సంస్థల ఉత్పత్తులు ప్రదర్శన, అమ్మకం మేళాను కలెక్టర్ డిల్లీరావు గురువారం ప్రారంభించారు. నాబార్డు జీఎం డా. కేవీఎస్ ప్రసాద్, డీజీఎం సీఆర్ అబువరాజన్ తదితరులతో కలిసి 44 స్టాళ్లను సందర్శించి.. వాటిని ఏర్పాటు చేసిన రైతు గ్రూపుల సభ్యులతో మాట్లాడారు. డిజిటల్ చెల్లింపులు చేసి ఒక ఎఫ్‌పీవో ఉత్పత్తులను స్వయంగా కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ఈ నెల 22 నుంచి 24 వరకు జరిగే మేళాకు ప్రజలు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పెద్దఎత్తున తరలివచ్చి చిన్న రైతులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. రైతులకు ఆధునిక ఈ-మార్కెటింగ్ అవకాశాలను దగ్గర చేసేందుకు, సేంద్రియ విధానంలో, నాణ్యతతో బయటకు వచ్చిన రైతు ఉత్పత్తులను ప్రజలకు పరిచయం చేసే గొప్ప లక్ష్యంతో నాబార్డు దేశ వ్యాప్తంగా తరంగ్ పేరుతో 50 రైతు ఉత్పత్తిదారుల సంస్థల ఉత్పత్తుల మేళాలను నిర్వహించనుందని.. ఇందులో భాగంగా తొలి మేళాకు విజయవాడ వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు. రైతులకు కేవలం ఇన్‌పుట్స్ ఇచ్చి వదిలేయకుండా వారిని నాబార్డు, బ్యాంకులు, స్మాల్‌ఫార్మర్స్ అగ్రీ బిజినెస్ కన్సార్టియం (ఎస్ఎఫ్ఏసీ) వంటివి చేయిపట్టి నడిపించి మంచి మార్కెటింగ్ విధానంతో లాభాలు ఆర్జించేలా చేస్తున్నాయని పేర్కొన్నారు. ఓఎన్‌డీసీ సేవలను రైతు గ్రూపులు సద్వినియోగం చేసుకోవడం ద్వారా తమ ఉత్పత్తులకు మంచి ఆదాయం వచ్చేలా చూసుకోవచ్చని.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మార్చడంలో నాబార్డు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కలెక్టర్ డిల్లీరావు పేర్కొన్నారు.
రైతుల సంక్షేమానికి వినూత్న కార్యక్రమాలు: నాబార్డు జీఎం డా. కేవీఎస్ ప్రసాద్
నాబార్డు జీఎం డా. కేవీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం లక్ష్యంగా నాబార్డు వివిధ వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోందని.. ఇందులో భాగంగా ప్రత్యేకంగా రైతు ఉత్పత్తిదారుల సంస్థలతో మేళాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓఎన్‌డీసీ వంటి ఆన్‌లైన్ పోర్టల్స్‌ను ఉపయోగించుకోవడం ద్వారా వినియోగదారులకు మరింత చేరువ కావడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చన్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా తమ ఉత్పత్తులకు విలువను జోడించడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుందని డా. కేవీఎస్ ప్రసాద్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో నాబార్డు డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎంఎస్ఆర్ చంద్రమూర్తి, ఎన్‌టీర్ జిల్లా నాబార్డు అధికారి ఎం.చౌసాల్కర్, స్మాల్‌ఫార్మర్స్ అగ్రీ బిజినెస్ కన్సార్టియం ప్రతినిధి కుల్‌వీర్ సింగ్, బ్యాంక్ ఆఫ్ బరోడా డీజీఎం చందన్ సాహు, కెనరా బ్యాంకు డివిజనల్ మేనేజర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News