-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా ఓపెన్ డయాస్ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రజల సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నట్లు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 63వ డివిజన్ విశాలాంధ్ర కాలనీలో రూ. 21.40 లక్షలతో నిర్మించిన ఓపెన్ డయాస్ ను స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం రూ. 11.07 లక్షలతో చేపట్టిన పార్కు సూపర్ వైజర్ గది నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. దాదాపు 300 కుటుంబాలు నివసించే విశాలాంధ్ర కాలనీలో ప్రజలు శుభకార్యాలు జరుపుకునేందుకు కళ్యాణ మండపం లేకపోవడంతో కొంత మంది రోడ్లపైన, మరికొందరు దూరప్రాంతాలకు వెళ్లి జరుపుకోవాల్సి వచ్చేదని మల్లాది విష్ణు తెలిపారు. దీంతో స్థానికుల అవసరాల దృష్ట్యా ఈ ప్రాంతంలో ఓపెన్ డయాస్ ను నిర్మించి.. ప్రహరీతో పరిరక్షించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ఈ ప్రదేశం పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా ఉండేదని గుర్తు చేశారు. కానీ నేడు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవడంతో ప్రజలు బయట ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశం లభించిందన్నారు.
తెలుగుదేశం గత ఐదేళ్ల పాలన నియోజకవర్గానికి శాపమని.. ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదని మల్లాది విష్ణు విమర్శించారు. కానీ వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టాక అభివృద్ధి కార్యక్రమాలపై చక్కని ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు వెల్లడించారు. స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా డివిజన్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు వివరించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.25 కోట్ల వ్యయంతో హోసన్నా మందిరం రోడ్డు., మరో రూ.1.20 కోట్ల వ్యయంతో డాక్టర్స్ కాలనీ రోడ్లను పూర్తిచేసుకున్నట్లు పేర్కొన్నారు. EWS కాలనీలో రూ. 1.50 కోట్ల వీఎంసీ సాధారణ నిధులతో రహదారులు నిర్మించుకున్నట్లు తెలిపారు. రూ. 60 లక్షలతో LIG – 1, 2., MIG – 1 కాలనీలలో రోడ్లు నిర్మించుకున్నట్లు చెప్పారు. రూ. 14 లక్షలతో తెలుగుతల్లి పార్కును సర్వాంగసుందరంగా తీర్చిదిద్దినట్లు వెల్లడించారు. అధికారంలో ఉన్నప్పుడు ఈ పనులన్నీ ఎందుకు చేపట్టలేకపోయారో గత పాలకులు సమాధానం చెప్పాలన్నారు. అలాగే 6 వార్డు సచివాలయాల పరిధిలో మంజూరైన రూ. 1.20 కోట్ల గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో అనేక రహదారులకు మోక్షం లభించిందన్నారు. కనుక గత చంద్రబాబు అసమర్థ ప్రభుత్వంలో పడకేసిన పనులకు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమర్థ నాయకత్వంలో శరవేగంగా జరుగుతున్న పనులకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలందరూ గమనించాలని కోరారు. అనంతరం కాలనీవాసులు ఎమ్మెల్యేను దుశ్శాలువ, మాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, ఏఈ మాధవ్, నాయకులు పసుపులేటి యేసు, మోదుగుల గణేష్, నాగేశ్వరరావు, టెక్యం కృష్ణ, సీహెచ్ రవి, రాజేశ్వరి, తిరుపతిరావు, కమలేష్, అలీ, ఆర్.యేసు, సూర్యనారాయణ, సచివాలయ సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News