– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డైలాగ్స్ ఫుల్.. జనం నిల్ అన్న తీరున టీడీపీ-జనసేన సభలు ఉన్నాయని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. కండ్రికలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. తాడేపల్లిగూడెం సభలో పవన్ మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలకు ఎన్నికల భయం పట్టుకుందని.. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక తెగ తర్జనభర్జన పడుతున్నట్లు మల్లాది విష్ణు పేర్కొన్నారు. టీడీపీ, జనసేన నేతల భయం వారి మాటల్లో స్పష్టంగా తెలుస్తోందని.. కనుకనే ముఖ్యమంత్రిపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. చివరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. చంద్రబాబు చేతిలో ఓ కీలుబొమ్మగా మారిపోయారని వ్యాఖ్యానించారు. టీడీపీ నుంచి 24 సీట్లు తెచ్చుకోవడమే పెద్ద విజయంగా పవన్ భావిస్తున్నారని.. ఈ మాత్రానికే వంగి వంగి నమస్కారాలు చేస్తూ, బాబుకు దాసోహం అంటున్నారని ఎద్దేవా చేశారు. స్థాయిని కూడా మరిచి 175 స్థానాలలో పోటీ చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై పవన్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వంగవీటి మోహనరంగా గారిని హత్య చేయించిన పార్టీతో కలిసిప్పుడే.. కాపు సోదరులు పవన్ కు దూరమయ్యారని మల్లాది విష్ణు అన్నారు. పవన్ తీరు పట్ల జనసైనికులే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబుకి అమ్ముడుపోయి.. జనసైనికుల ఆత్మగౌరవాన్ని బాబు పాదాల దగ్గర పవన్ తాకట్టుపెట్టారని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తున్న ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ.. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం సభలో మాట్లాడిన మాటలను జనసేన అధ్యక్షుడు తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
Prajavartha Online Telugu News