-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలందరూ గర్వపడేలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ ఆడపడుచులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. మహిళలు లేకపోతే ప్రపంచం నడవదని.. నేటి సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారని మల్లాది విష్ణు అన్నారు. అటువంటి అక్కచెల్లెమ్మల తలరాతను మార్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. చంద్రబాబులా తమది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. మహిళా సంక్షేమం కోసం మన రాష్ట్రంలో అమలు చేస్తునన్ని పథకాలు దేశంలో మరే రాష్ట్రంలో అమలు కావడం లేదని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 33,940 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 118 కోట్ల 64 లక్షలు., సున్నావడ్డీ పథకం ద్వారా 42,760 మందికి రూ. 17 కోట్ల 26 లక్షలు., వైఎస్సార్ చేయూత ద్వారా 10,875 మందికి రూ. 63 కోట్ల 35 లక్షలు., అమ్మఒడి పథకం ద్వారా 28,834 మంది తల్లులకు రూ. 118 కోట్ల 98 లక్షలు., వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 2,583 మందికి రూ. 12 కోట్లు., ఈబీసీ నేస్తం ద్వారా 2,593 మందికి రూ. 6 కోట్ల 81 లక్షలు సహా పలు ప్రభుత్వ పథకాల ద్వారా నేరుగా ఆడపడుచుల ఖాతాలలో నగదు జమ చేసినట్లు వెల్లడించారు. మొత్తంగా ఐదేళ్లలో దాదాపు 58 వేల మంది లబ్ధిదారులకు రూ. 440 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు వివరించారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని మల్లాది విష్ణు అన్నారు. నగర మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు సెంట్రల్ లో 12 మంది మహిళా కార్పొరేటర్లు ఉండటమే ఇందుకు నిదర్శనమన్నారు. మహిళా సంక్షేమంలో మరే ప్రభుత్వం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సాటిరాదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News