రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత రాజమహేంద్రవరం మహిళా కారాగారం నందు జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియ చేశారు. కారాగారంలో ఉన్న మహిళలు ఏ విషయాల గురించి ఆందోళన పడవద్దని, పరివర్తన గృహంలో వారి జీవన శైలిని శాంతి దాయకంగా మార్చుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ వివిధ నైపుణ్యాలను నేర్చుకోవడం వల్ల విడుదల అనంతరం ఆర్ధికంగా బలపడేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. మహిళలందరూ ఉచిత న్యాయ సేవలు పొందేందుకు అర్హులని, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలన్నారు. అంతే కాకుండా వారి కుటుంబ సభ్యులుకు, పిల్లలకు అంద వలసిన సంక్షేమ పథకాలు అందకపోయినా, న్యాయ పరమైన సమస్యల్లో ఉన్నా నిస్సందేహంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించవచ్చని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష కుమారి మాట్లాడుతూ మహిళలకు, పిల్లలకు, బడుగు బలహీన వర్గాలకు సంస్థ అందిస్తున్న సేవల గురించి వివరించారు. వేడుకల్లో భాగంగా చేసిన నృత్య, నాటక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డి.ఐ.జి. రవి కిరణ్, ఓ. ఎన్.జి.సి. చీఫ్ జనరల్ మేనేజర్ మనీష శర్మ , జనరల్ మేనేజర్ సంగీత సాహు, మహిళా కారాగార సూపరింటెండెంట్ వసంత కుమారి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News