-పేపర్-1కు 63.06 శాతం, పేపర్-2కు 62.66 శాతం హాజరు
-జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)- గ్రూప్-1 స్క్రీనింగ్ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడలో 24 కేంద్రాల్లో 10,526 మంది అభ్యర్థులకు పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేయగా.. ఉదయం జరిగిన పేపర్-1కు 63.06 శాతం (6,638), మధ్యాహ్నం జరిగిన పేపర్-2కు 62.66 శాతం (6,596) మంది హాజరైనట్లు వెల్లడించారు. పరీక్షను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన కోఆర్డినేటింగ్, కస్టోడియన్, రూట్, లైజనింగ్ అధికారులు తదితరులకు అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పరీక్షను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్యం, విద్యుత్, ప్రజా రవాణా తదితర శాఖల అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ డిల్లీరావు వెల్లడించారు.
పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్
ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్-2కు పరీక్ష జరగ్గా.. జిల్లా జాయింట్ కలెక్టర్, కోఆర్డినేటింగ్ అధికారి డా. పి.సంపత్ కుమార్ ఆదివారం విజయవాడలోని వివిధ పరీక్ష కేంద్రాలను సందర్శించారు. బిషప్ అజరయ్య జూనియర్ కాలేజీ, శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలిచ్చారు.
Prajavartha Online Telugu News