విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవ భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బి. ఆర్. అంబేద్కర్ యావత్ ప్రపంచానికే ఆదర్శనీయులని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు అభివర్ణించారు. భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు తోపాటు, డీఆర్వో వి శ్రీనివాసరావులు డా. బి.ఆర్. అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవభారత నిర్మాణంలో డా. బి.ఆర్.అంబేద్కర్ పోషించిన పాత్ర విశేషమైనదన్నారు. ప్రపంచానికే ఆదర్శనీయమైన రాజ్యాంగాన్ని ఆయన రచించారని ఆయన అపార మేధావి, విద్యావంతులు అని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబెడ్కర్ త్యాగానికి, కృషికి, పట్టుదలకు, నిజాయితీకి, నిబద్ధతకు, చిత్తశుద్ధికి, క్రమశిక్షణకు, అకుంఠిత దీక్షాదక్షతకు నిదర్శనం అన్నారు. డా.బి.ఆర్.అంబేద్కర్ మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వారన్నారు. దేశం పట్ల ప్రతి పౌరుడు తన బాధ్యతలను మరువరాదన్నారు. ప్రపంచదేశాలు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాయంటే అంబేద్కర్ గారి రాజ్యాంగ రచనా నైపుణ్యం ఎంతటిదో అర్థమవుతుందని అన్నారు. బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి అని, నవభారత నిర్మాణంలో ఆయన పోషించిన పాత్ర ఎంతో కీలకమైనదన్నారు. వివిధ హోదాల్లో ఎన్నో సేవలు అందించిన ఆయన సేవలు. యావత్ ప్రపంచానికి స్ఫూర్తి దాయకం అని ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని కలెక్టర్ ఢిల్లీ రావు పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News