-వేలాది మంది వెంట రాగా కోలాహలంగా నామినేషన్ ర్యాలీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేలాదిమంది వెంటరాగా అంగరంగ వైభవంగా పండుగ వాతావరణం లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా జనసేన విజయవాడ నగర అధికార ప్రతినిధి, ఐజా గ్రూప్ చైర్మన్ షేక్ గయాసుద్దీన్ (ఐజా) గురువారం తన నామినేషన్ వేశారు. పాల ఫ్యాక్టరీ సమీపంలోని సాయిరాం థియేటర్ వద్ద నుంచి ప్రారంభమైన గయాసుద్దీన్ ర్యాలీ చిట్టినగర్ సెంటర్, కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి మీదగా రథం సెంటర్ వరకు జరిగింది. ఆద్యంతం ఎంతో హుషారుగా జరిగిన ర్యాలీలో మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గయాసుద్దీన్ ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీలో ముందుకు సాగారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని ,వాటినీ పరిష్కరించి ప్రజలకు మేలు చేయాలని లక్ష్యంతో తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలిచినట్లు చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని ఆయన చెప్పారు. పశ్చిమ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా తన వద్ద కొన్ని ప్రణాళికలు ఉన్నాయని, వాటిని అమలు చేస్తే పశ్చిమ నియోజకవర్గం నెంబర్ వన్ గా అభివృద్ధి చెందుతుందని ఐజా వివరించారు. కాగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన గయాసుద్దీన్ ను పలువురు ప్రముఖులు అభినందించడం జరిగింది.
Prajavartha Online Telugu News