-జిల్లాలో ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం : కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు- 2024 లో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో పూర్తి అయిందని, ఉపసంహరణ తరువాత జిల్లాలోని పార్లమెంట్ నియోజకవర్గానికి 23 మంది , 7 అసెంబ్లి నియోజకవర్గాలకు 133 మంది అభ్యర్థులు వివిద పార్టీల తరపున ఎన్నికలలో పోటీ చేయనున్నారని, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు.
సోమవారం మద్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లోని వి.సి. హాల్ నందు సార్వత్రిక ఎన్నికలు – 2024 లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ, స్క్రూటినీ, నామినేషన్ల ఉపసంహరణ పూర్తి అయ్యిందనీ, అభ్యర్థుల తుది జాబితా మేరకు ఓటింగ్ గుర్తుల కేటాయింపు జరుగుతుందని విలేఖరుల సమావేశంలో కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సంధర్భంగా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు- 2024 లో భాగంగా జిల్లాలోని తిరుపతి పార్లమెంట్, 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి మొత్తం 227 మంది నామినేషన్లు వేయగా వీరిలో 50 మంది నామినేషన్లను స్క్రూటినీలో తిరస్కరింపబడ్డాయని తదుపరి ఉపసంహరణ లో 21 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని, నామినేషన్ల ఉపసంహరణ తరువాత జిల్లాలోని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి 23 మంది, 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 133 మంది అభ్యర్థులు వివిద పార్టీల తరపున ఎన్నికలలో పోటీ చేయనున్నారని తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ తరువాత ఎన్నికలలో పోటీ చేయనున్న అభ్యర్థుల వివరాలను ఎన్నికల కమీషన్ సూచనల మేరకు పోస్టల్ బ్యాలెట్ మరియు ఈ వి ఏం బ్యాలెట్ ప్రింట్ కు పంపడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గo పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు అదనంగా 1 బ్యాలెట్ యూనిట్లు , తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గo పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు అదనంగా 2 బ్యాలెట్ యూనిట్ అవసరం ఉన్నదని వాటిని వివిద జిల్లాల నుండి, సి.ఈ.ఓ. కార్యాలయం ఆదేశాల మేరకు రేపటిలోపు తీసుకుని రావడం జరుగుతుందని అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సదరు బ్యాలెట్ యూనిట్లకు ఫస్ట్ లెవెల్ చెకింగ్ (ఎఫ్.ఎల్.సి), ర్యాండమైజేషన్ నిర్వహించిన అనంతరం సంబందిత నియోజకవర్గాలకు కేటాయించడం జరుగుతుందని అన్నారు. మే 1 వ తేదీన 21 మంది బెల్ ఇంజనీర్లు ఈ.వి.ఎం ల ప్రిపరేషన్ ప్రక్రియకు రానున్నారని మే 3 వ తేదీ లోపు ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు.
ఎన్నికల విధులలో ఉన్న వివిద రకాల ఉద్యోగులకు సంబందించి 22,416 మంది నుండి పోస్టల్ బ్యాలెట్ కొరకు ధరఖాస్తులు అందాయని, వీరికి మే 05 , 06 వ తేదీలలో సంబందిత నియోజకవర్గ ఫెసిలిటేషన్ సెంటర్ల నందు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కల్పించడం జరుగుతుందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ లను చిత్తూరు ప్రింటింగ్ ప్రెస్ నందు, ఈ వి ఎం బ్యాలెట్ ప్రింటింగ్ లను కర్నూల్ నందు ఉన్న ప్రింటింగ్ ప్రెస్ లలో ప్రింటింగ్ చేయనున్నారని తెలిపారు.
పోలింగ్ విధుల కేటాయింపు జరిగిన సిబ్బందికి మే 2 న పోలింగ్ విధులు కేటాయించబడిన నియోజక వర్గంలో శిక్షణ ఇవ్వననున్నామని తెలిపారు. మే 12 వ తేదీన పోలింగ్ సిబ్బందికి ఏ పోలింగ్ స్టేషన్ నందు విధులు కేటాయించారో తెలియజేయడం జరుతుందని అన్నారు. దీనితో పాటు వెబ్ క్యాస్టింగ్ ,వీడియో గ్రఫీ, మైక్రో ఆబ్సర్వర్ల ఏర్పాటు, తదితరాలు అన్నీ మార్గదర్శకాల మేరకు ఏర్పాటు చేయడం జరుగుతోందని అన్నారు.
అనంతరం ఎస్.పి కృష్ణ కాంత్ పటేల్ మాట్లాడుతూ ప్రశాంత ఎన్నికల కొరకు పోలీస్ శాఖ తరపున తగినంత పోలీస్ భద్రతను ఇవ్వనున్నామని తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినప్పటి నుండి 774 కేసులు నమోదు చేయడం జరిగిందని వీటిలో 18 కేసులపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయడం జరిగిందని, 10 కేసులపై చార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగిందని మిగిలిన 600 కేసులు దర్యాప్తు లో ఉన్నాయని మరి కొన్ని రోజులలో వీటిని పూర్తి చేస్తామని తెలిపారు. వెపన్స్ కు సంబందించి 505 ఉంటే 503 డిపాజిట్ చేయించామని మిగిలిన రెండు లైసెన్సులు రద్దు చేసామని తెలిపారు. ఎన్నికలకు కేటాయించిన కేంద్ర బలగాలను అన్ని నియోజకవర్గాలకు కేటాయించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
నియోజకవర్గాల వారీగా ఎన్నికలలో పోటీ చేయనున్న తుది అభ్యర్థుల వివరాలు:
23- తిరుపతి (SC) పార్లమెంట్ – 23 మంది అభ్యర్థులు
120 – గూడూరు (SC) – అభ్యర్థులు 14 మంది అభ్యర్థులు
121- సూళ్లూరుపేట (SC) – 9 మంది అభ్యర్థులు
122 – వెంకటగిరి- 10 మంది అభ్యర్థులు
166 – చంద్రగిరి – 24 మంది అభ్యర్థులు
167 – తిరుపతి – 46 మంది అభ్యర్థులు
168 – శ్రీకాళహస్తి – 15 మంది అభ్యర్థులు
169 – సత్యవేడు (SC) – 15 మంది అభ్యర్థులు
నియోజకవర్గాల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల వివరాలు
120 గూడూరు (ఎస్సీ) – జడ్పీ బాయ్స్ హై స్కూల్ , గూడూరు
121 -సూళ్ళూరుపేట (ఎస్సీ)- శ్రీ వి.ఎస్.ఎస్.సి. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, సూళ్ళూరుపేట
122- వెంకటగిరి – విశ్వోదయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ , వెంకటగిరి
166- చంద్రగిరి- శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ హ్యుమానిటీస్ బ్లాక్ 1, తిరుపతి
167 – తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కాలేజ్, తిరుపతి
168 – శ్రీకాళహస్తి స్కిట్ కాలేజ్, శ్రీకాళహస్తి
169 – సత్యవేడు (ఎస్సీ)- ఎంపీడీవో ఆఫీస్, సత్యవేడు
Prajavartha Online Telugu News