– అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా గుర్తుల కేటాయింపు
– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 19 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా.. వీరిలో ఇద్దరు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో చివరకు 17 మంది అభ్యర్థులు పోటీలో నిలిచినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఆర్వో, కలెక్టర్ ఎస్.డిల్లీరావు కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జనరల్ అబ్జర్వర్లు మంజూ రాజ్‌పాల్, నరీందర్సింగ్ బాలి సమక్షంలో అభ్యర్థుల వివరాల పరిశీలన, గుర్తుల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అభ్యర్థులు, ఎలక్షన్ ఏజెంట్లు, అభ్యర్థుల ప్రతినిధులు హాజరుకాగా కలెక్టర్ డిల్లీరావు.. నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థుల పేర్లతో పాటు చివరిగా విజయవాడ పార్లమెంటు స్థానానికి పోటీపడుతున్న 17 మంది అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. గుర్తింపు పొందిన జాతీయ మరియు రాష్ట్ర రాజకీయ పార్టీల కేటగిరీ నుంచి కేశినేని శివనాథ్ (చిన్ని)-తెలుగుదేశం, కేశినేని శ్రీనివాస్ (నాని)-యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, భార్గవ్ వల్లూరు (భారత జాతీయ కాంగ్రెస్), మేకా వెంకటేశ్వరరావు (బహుజన సమాజ్ పార్టీ) పోటీలో ఉన్నట్లు తెలిపారు. నమోదు కాబడిన రాజకీయ పార్టీల అభ్యర్థుల కేటగిరీ నుంచి కృష్ణ కిషోర్ యనమండ్ర (నవతరం పార్టీ), గుజ్జుల లలిత (సోషలిస్టు యూనిటి సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్టు); చాగంటిపాటి గంగాధర్ గాంధీ (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), చింతలచెరువు హేమలత (జై మహాభారత్ పార్టీ), ఎన్.దశరథ రామిరెడ్డి (ఆలిండియా జైహింద్ పార్టీ), దాట్ల లూర్థు మేరి (జైభీమ్ రావ్ భారత్ పార్టీ), దేవరశెట్టి రవీంద్రబాబు (ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి), పేరం శివ నాగేశ్వరరావు (రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే); బర్రె శ్రీనివాసరావు (జైభీమ్ శ్రీనివాస్)-తెలుగు రాజాధికార సమితి పార్టీ; సయ్యద్ ఖమురున్నీసా (నవరంగ్ కాంగ్రెస్ పార్టీ) పోటీలో నిలిచినట్లు వివరించారు. ఇతర అభ్యర్థులు (స్వతంత్ర అభ్యర్థులు) కేటగిరీ నుంచి అర్జున్ చెవిటి, చరణ్ సుజిత్ నంబూరు నామినేషన్లను ఉపసంహరించుకోగా అనిల్ కుమార్ మద్దినేని, దేవరపల్లి మల్లిఖార్జునరావు (మహేష్), వెంకట అశోక్ పప్పూరి పోటీలో నిలిచినట్లు తెలిపారు. అనంతరం ఈసీఐ ఎలక్షన్ సింబల్స్ (రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్) ఆర్డర్‌కు అనుగుణంగా రిజర్వ్డ్ సింబల్స్, ఫ్రీ సింబల్స్‌ను పరిగణనలోకి తీసుకొని గుర్తుల కేటాయింపు ప్రక్రియను చేపట్టారు. అభ్యర్థులు ఇచ్చిన ప్రాధాన్యక్రమం, లాటరీ ద్వారా ఫ్రీ సింబల్స్ కేటాయింపు జరిగింది. నిష్పక్షపాతంగా, అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియను నిర్వహించినట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. విజయవాడ పార్లమెంటరీ స్థానానికి పోటీలో నిలిచిన అభ్యర్థులకు తదుపరి కార్యాచరణపై కలెక్టర్ అవగాహన కల్పించారు. ఈవీఎం ర్యాండమైజేషన్, ఈవీఎం కమిషనింగ్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో మూడు సందర్భాల్లో క్రిమినల్ యాంటిసిడెంట్స్ పబ్లికేషన్ తదితరాలను వివరించారు.
నేరుగా లేదా ఫోన్లో ఫిర్యాదు చేయొచ్చు: జనరల్ అబ్జర్వర్ మంజూ రాజ్‌పాల్
ఇప్పటికే జనరల్, పోలీస్, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు అందుబాటులో ఉండే సమయం, స్థలం, ఫోన్ నంబరు వివరాలను మీడియా ద్వారా వెల్లడించడం జరిగిందని.. ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదులు లేదా విజ్ఞాపనలను అభ్యర్థులు అందించవచ్చని జనరల్ అబ్జర్వర్ మంజూ రాజ్‌పాల్ తెలిపారు. సంబంధిత ఆర్వో ద్వారా వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. ప్రచారం సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)ని అభ్యర్థులు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. సువిధ యాప్ ద్వారా అనుమతులు, సీ-విజిల్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ, ఈసీఐ డిజిటల్ వేదికలు తదితరాలపై జనరల్ అబ్జర్వర్ మంజూ రాజ్‌పాల్ అభ్యర్థులకు సూచనలు చేశారు.
Prajavartha Online Telugu News