గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశిత మార్గదర్శకాల మేరకు ఈవిఎం ర్యాండమైజేషన్ విధానం ద్వారా పోలింగ్ కేంద్రాలకు ఈవిఎంల కేటాయింపు చేస్తున్నామని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ) కీర్తి చేకూరి తెలిపారు. బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు ఎస్.పి.కార్తీక, తూర్పు నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్ధుల ఆధ్వర్యంలో ఈవిఎంల ర్యాండమైజేషన్ ని నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో చేపట్టారు.
ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ నిబందనల మేరకు ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 255 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల బ్యాలెట్ యూనిట్ల కేటాయింపుకు ఈవిఎం మేనేజ్మేంట్ సిస్టమ్ ద్వారా ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్ధుల ఆధ్వర్యంలో జరిగిన ర్యాండమైజేషన్ లిస్టు మేరకు మే 13 జరిగే ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలో ఈవిఎంలను వినియోగిస్తామని తెలిపారు. అలాగే ఎలక్ట్రోరల్ రోల్ ని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్ధులకు అందిస్తామని, గుర్తింపు లేని పార్టీల ప్రతినిధులు, ఇండిపెండెంట్ అభ్యర్ధులు ఎలక్ట్రోరల్ రోల్ కావాలి అంటే నిర్దేశిత రుసుం చెల్లించి తీసుకోవచ్చని తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్ధులకు గుర్తింపు కార్డ్ లు అందించామని తెలిపారు. హోం ఓటింగ్ కి సంబందించి రూట్ మ్యాప్ ని పోటీలో ఉన్న అభ్యర్ధులకు అందిస్తామని, హోం ఓటింగ్ పరిశీలనకు అభ్యర్ధులు లేదా వారి ఏజంట్లు ఉండవచ్చని, అందుకు అవసరమైన వివరాలు ఇస్తే గుర్తింపు కార్డ్ లు అందిస్తామని తెలిపారు. అభ్యర్ధులు, అధికారులతో కలిసి వాట్స్ అప్ గ్రూప్ ఏర్పాటు చేశామని, గ్రూప్ లో ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారం పోస్ట్ చేస్తామని వివరించారు.
కార్యక్రమంలో ఏఆర్ఓలు సునీల్ కుమార్, భీమరాజు, ప్రదీప్ కుమార్, ఈఈ సుందర్రామిరెడ్డి, మేనేజర్ ఎస్.ఎన్.ప్రసాద్, సూపరిండెంట్ లు పద్మనాభరావు, రవికిరణ్ రెడ్డి, అభ్యర్ధులు, ఎలక్షన్ ఏజంట్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News