– కీలక ప్రక్రియను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగమ్
ఎన్నికల ప్రక్రియలో మరో కీలక ఘట్టమైన ఈవీఎం కమిషనింగ్ గురువారం ప్రారంభం కాగా.. నియోజకవర్గాల స్థాయిలో సజావుగా సాగుతోంది. రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగమ్.. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావుతో కలిసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో గాంధీజీ మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్, కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియను పరిశీలించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎంల రెండో దశ ర్యాండమైజేషన్ ప్రకారం కమిషనింగ్ చేపట్టారు. వీవీప్యాట్లకు సంబంధించి సింబల్ లోడింగ్, పవర్ ప్యాక్, పేపర్ రోల్, సీలింగ్ ఆఫ్ పేపర్ రోల్ కంపార్టుమెంటు జరుగుతుంది. అదే విధంగా బ్యాలెట్ యూనిట్‌కు సంబంధించి బ్యాలెట్ పేపర్, థంబ్ వీల్ సెట్టింగ్, మాస్కింగ్, అడ్రెస్ ట్యాగింగ్ జరుగుతుంది. కంట్రోల్ యూనిట్‌కు సంబంధించి క్యాండిడేట్ సెట్టింగ్, సీలింగ్ ఆఫ్ క్యాండిడేట్ సెట్ వంటివి చేస్తారు. అభ్యర్థులు, ఎలక్షన్ ఏజెంట్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరుల సమక్షంలో అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఈ ప్రక్రియ జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎం కమిషనింగ్ అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ అని..అందుకే ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత పకడ్బందీగా, అప్రమత్తతతో కమిషనింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డిల్లీరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్, డీఆర్వో వి.శ్రీనివాసరావు, రిటర్నింగ్ అధికారి ఇ.కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News