-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
వెంకటగిరి, సూళ్లూరుపేట, నేటి పత్రిక ప్రజావార్త :
వెంకటగిరి, సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో వారి నియోజకవర్గానికి ఎన్నికల విధులు కేటాయించబడిన పీ.ఓ, ఎపిఓ లకు ఆన్ హ్యాండ్ శిక్షణ ను పరిశీలించి మాట్లాడుతూ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర ఎన్నికల నిర్వహణలో చాలా కీలకం అని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
గురువారం తిరుపతి, చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న పి.ఓ, ఎపిఓ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం….. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో విశ్వోదయ డిగ్రీ కళాశాలలో, సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని గోకుల కృష్ణ ఇంజినీరింగ్ కళాశాల నందలి పి.ఓ, ఎపిఓ శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సాధారణ ఎన్నికలు 2024 లోక్ సభ మరియు శాసన సభ ఎన్నికల నిర్వహణ లో పి.ఓ ల పాత్ర చాలా కీలకమని, ఎప్పటికప్పుడు ఎన్నికలు కొత్తగా చూడాలని, పీ.ఓ హ్యాండ్ బుక్ చదివి పూర్తి అవగాహన కలిగి ఉండాలి అని, అప్పుడు ఎన్నికల నిర్వహణ సులువు అవుతుందని అన్నారు. ఇప్పుడు మనం అందరం కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నామని, అత్యంత బాధ్యతగా పని చేయాలని, ఎన్నికల విధులలో పాల్గొనడం ఒక గొప్ప పవిత్ర బాధ్యతగా భావించాలని అన్నారు. ఈవిఎం వాడకంపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, నిర్దేశిత పత్రాలలో వివరాల నమోదు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పేపర్ సీలింగ్, ప్యాకింగ్ వంటి అంశాలపై శిక్షణ కార్యక్రమంలో పూర్తిగా తెలుసుకోవాలని అన్నారు. పోలింగ్ దినం నాడు 2 గం.లకు ఒకసారి ఇచ్చే రిపోర్ట్ సకాలంలో అందేలాగ సెక్టార్ అధికారికి ఎప్పటికప్పుడు సమాచారం అందేలా చూడాలని, 17C డేటా పక్కాగా ఉండాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామాగ్రి, ఈవిఎం లు డిస్ట్రిబ్యుషన్ సెంటర్ నందు ఇవ్వబడతాయి అని, వాటిని చెక్ లిస్ట్ మేరకు సరిచూసుకోవాలని అన్నారు. అలాగే పోలింగ్ పార్టీ 1+5 ఉంటారని, సదరు పోలింగ్ అధికారులకు కనీస వసతులు ఏర్పాట్లు సంబంధిత సెక్టర్ అధికారులు, బిఎల్వో లు చూడాలని తెలిపారు.
ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించి రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈ ప్రక్రియను ఉదయం 6.30 గం. లలోపు పూర్తి చేయాలని అన్నారు. మాక్ పోల్ జరపకుండా పోలింగ్ ప్రారంభించకూడదని, ఉదయం 7 గంటల కల్లా పోలింగ్ ప్రారంభించాలన్నారు. పి.ఓ డైరీ, పి.ఓ రిపోర్ట్ ఇతర పత్రాలు ఎప్పటికప్పుడు పి.ఓ లు నమోదు చేయాలనీ సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే సంబంధిత సెక్టర్ అధికారికి, రిటర్నింగ్ అధికారికి తెలియ చేయాలన్నారు. ఈవిఎం మరియు పోలింగ్ కేంద్రాలలో సమస్య లు ఉంటే సెక్టోరల్ అధికారికి, రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలని అన్నారు. విధులు కేటాయించబడిన పి.ఓ లు, ఏపీఓ లు, ఇతర పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రానికి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి ఈవిఎంలను పోలింగ్ సామాగ్రిని తీసుకెళ్లేటప్పటి నుండి తిరిగి ఈవీఎంలను రిసెప్షన్ కేంద్రంలో అప్పగించే వరకు బాధ్యతగా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఈవిఎం లు, సంబంధిత ఫారాలను పూరించడం తదితరాలను హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ పక్కాగా నిర్వహించాలని సూచించారు. పీ.ఓ, ఎపీఓ లకు పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రిసైడింగ్ అధికారి రోల్ చాలా ముఖ్యమని అన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు, అవసరం మేరకు వీడియోగ్రఫీ ఏర్పాటు చేస్తున్నామని, సి ఆర్ పి ఎఫ్ తదితర కేంద్ర బలగాలు మన రాష్ట్ర పోలీస్ తో పాటు తగినంత ఏర్పాటు చేస్తున్నామని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పారదర్శకంగా నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలింగ్ నిర్వహణకు హాజరవుతున్న మీ అందరి సురక్షితం మా బాధ్యత అని, సమిష్టిగా మనమందరం కలిసి మన జిల్లాలో సాధారణ ఎన్నికలు 2024 లను విజయవంతం చేద్దామని కలెక్టర్ పేర్కొన్నారు.
వెంకటగిరి నందు ఈవిఎం లను భద్రపరచు ఇంటీరియం స్ట్రాంగ్ రూం ను జెసి మరియు వెంకటగిరి రిటర్నింగ్ అధికారి ధ్యాన చంద్ర హెచ్ఎం తో కలిసి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి చంద్రముని, శిక్షణ పొందుతున్న పీఓ లు, ఎపీఓ లు తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News