మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సక్రమంగా అందరూ వినియోగించుకొనుటకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. శుక్రవారం స్థానిక నోబుల్ కళాశాలలో మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాట్లు కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికలలో పోలింగ్ విధుల్లో ఉండే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సులభతరంగా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈనెల 4వ తేదీ ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు, మైక్రో అబ్జర్వర్లకు, ఈనెల 5వ తేదీ ఓపిఓలకు, 6వ తేదీ పోలీస్ సిబ్బంది, ఎసెన్షియల్ సర్వీసెస్, డ్రైవర్లు వీడియో గ్రాఫర్లు తదితరులకు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడంలో తగిన అవగాహనకై హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి మార్గదర్శకం చేయాలని, చిత్రాలతో (పిక్టోరియల్)కూడిన పోస్టర్లు ప్రదర్శించాలని, ఏ ఫారం ఏ కవర్లో పెట్టాలి, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పట్ల అవగాహన కల్పించాలని, ముఖ్యంగా ఏ ఏ కారణాలతో ఓటు invalid అవుతుందో వివరించాలని, ఆ విధమైన పొరపాట్లు చేయకుండా వినియోగించుకునే ప్రతి ఓటు చెల్లే విధంగా వారిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసిన వారందరు వారి ఓటు సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్ ముందుగా తెలుసుకోవడానికి వీలుగా ఓటర్ హెల్ప్ లైన్ లింక్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విధానం గురించి వివరిస్తూ సంక్షిప్త సందేశాలు పంపాలన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు ఓటరు డిక్లరేషన్ తీసుకోవాలని, బ్యాలెట్ నెంబర్, వోటర్ సీరియల్ కరెక్ట్ గా వేయాలని, సీక్రసీ ఆఫ్ ఓటింగ్ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఇదే ఆవరణలో ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ కలెక్టర్ పరిశీలించి ఈవీఎం కమిషనింగ్ అంటే బ్యాలెట్ యూనిట్ లో బందరు పార్లమెంట్ బ్యాలెట్ పేపర్ సెట్ చేయడం, కంట్రోల్ యూనిట్ వీవి ప్యాట్ లో అభ్యర్థులు వారి గుర్తులు లోడ్ చేయడం వాటికి సీల్ వేయడం, మాక్ పోల్ నిర్వహించి వాటిని పరీక్షించడం వంటి కార్యక్రమాన్ని పరిశీలించారు. రిటర్నింగ్ అధికారి, బందరు ఆర్డిఓ ఎం వాణి మచిలీపట్నం నియోజకవర్గంలో ఈవీఎం కమిషనింగ్ వివరాలు కలెక్టర్ కు తెలియజేశారు. డి ఆర్ ఓ కె చంద్రశేఖర రావు మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, డీఈవో తాహెరా సుల్తానా, సర్వే ఏడి మనీషా త్రిపాఠి, తాసిల్దారు తోట సతీష్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News