విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదవాడికి ధనవంతుడికి మధ్య జరుగుతున్న ఎన్నికల పోరాటంలో పేదవాడైన వైసిపి అభ్యర్థి షేక్ ఆసిఫ్ ని గెలిపించాలని పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు ఐజా గ్రూప్ చైర్మన్, జనసేన విజయవాడ నగర అధికార ప్రతినిధి షేక్ గయాసుద్దీన్ పిలుపు నిచ్చారు. శనివారం భవానిపురంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ కనీసం 20000 మెజార్టీతో గెలుస్తారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి దిగుమతి అయిన బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి ఇక్కడి స్థానికులకు అవసరం లేదని, స్థానికుడైన వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ తోనే ప్రజలకు సరైన న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. పొత్తులో భాగంగా కూటమి తరుపున పశ్చిమ సీటును బిజెపికి కేటాయించారని, అయితే బిజెపి నాయకత్వం జనసేన నాయకులను, కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని, గాలికి వదిలేసారని ఘాటుగా విమర్శించారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువగా మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు కాపులు ఉన్నారని, వీరందరూ రానున్న ఎన్నికల్లో ఆసిఫ్ ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఐజా విజ్ఞప్తి చేశారు. ఎక్కడి నుంచో దిగుమతి అయిన సుజనా చౌదరి అవసరం ఇక్కడ ప్రజలకు లేదని అన్నారు. అనేక సమస్యలు ఉన్న పశ్చిమ నియోజక వర్గమును స్థానికులే సరైన రీతిలో అభివృద్ధి చేయగలరని అన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని గెలిపించడం ఎంత అవసరమో, విజయవాడ పశ్చిమ లో ఆసిఫ్ ను గెలిపించడం కూడా అంతే అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో పోతిన మహేష్ జనసేనపార్టీ వ్యవహారాలపై కొన్ని నిజాలు మాట్లాడారన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసిపి అభ్యర్థి ఆసిఫ్ గెలుపుతోనే సామాన్యుడికి న్యాయం జరుగుతుందని ఐజా స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News