-ఓట్ల లెక్కింపు అవగాహన కోసమే మోడల్ కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు
-జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ పక్రియలో సాయంత్రం 4 గంటలకల్లా ఫలితాలు వెల్లడించేలా ఉండాలి
-ఎటువంటి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ ప్రక్రియ ఆగకూడదు : కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు – 2024 ప్రక్రియలో భాగంగా జూన్ 4వ తేదీన నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియ లో భాగంగా ఎన్నికల ఓట్ల లెక్కింపునకు విధులు కేటాయించబడిన సిబ్బంది అందరూ శిక్షణ ద్వారా సంపూర్ణ అవగాహన పెంచుకొని సమర్థవంతంగా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన మోడల్ కౌంటింగ్ కేంద్రం నందు హాండ్స్ ఆన్ ట్రైనింగ్ ద్వారా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, ఎఆర్ఓ లకు ఓటర్ల లెక్కింపు విధానంపై శిక్షణ కార్యక్రమంను నిర్వహించారు.
మోడల్ కౌంటింగ్ కేంద్రం నందు ఆర్వో లు, ఏ ఆర్ ఓలకు సియూ, ఈ వీ ఎం ల ద్వారా ఓట్ల లెక్కింపు చేసే విధానాన్ని ప్రత్యక్షంగా తెలియజేస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు.
అనంతరం సంబంధిత అధికారులతో సమావేశమై జూన్ 4 వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలు- 2024 ఓట్ల లెక్కింపు లో భాగంగా ఈ రోజు ఏర్పాటు చేసిన మోడల్ కౌంటింగ్ కేంద్రంలోని హాండ్స్ ఆన్ ట్రైనింగ్ ద్వారా అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజక వర్గాల ఆర్వోలు, ఏఆర్వోలకు ఓట్ల లెక్కింపు విధానం పై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సంబంధిత అధికారులు ఓట్ల లెక్కింపు పై అవగాహన పెంచుకొని సమర్థవంతంగా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. ఓట్ల లెక్కింపుకు సంబంధించిన అన్ని సందేహాలను ముందుగానే నివృత్తి చేసుకోవాలన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయంలో ఒక పార్లమెంటు, అసెంబ్లీ కి సంబంధించిన ఏడు నియోజక వర్గాల వారీగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఓట్ల లెక్కింపు పక్రియకు అవసరమైన అన్ని ఏర్పాట్లును రిటర్నింగ్ అధికారులు చూసుకోవాలని అన్నారు. ప్రతి కౌంటింగ్ హాలు నందు వీడియో గ్రఫీ తో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన కంప్యూటర్స్, ఇంటర్నెట్ సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, టేబుల్స్, కుర్చీల ఏర్పాటు తదితర అంశాలపై ఆర్వోలు మందస్తుగా సరి చూసుకోవాలన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి వాహనాల అనుమతి ఉండదని కౌంటింగ్ విధులు కేటాయించిన అందరికీ మెయిన్ గేటు నుంచి కౌంటింగ్ సెంటర్ వరకు బస్సును ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. భద్రత చర్యల్లో భాగంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు ఉంటుందని అన్నారు. ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు నిర్దేశిత సమయం ఉదయం 8 గం. లకు కౌంటింగ్ ప్రారంభం కావాలని, ఎలాంటి పరిస్థితుల్లో కౌంటింగ్ ప్రక్రియ ఆగకూడదని తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందే ఆర్వోలు నియోజకవర్గాల వారిగా ఈవీఎంలను సరి చూసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ లో పాల్గొనే ప్రతి ఒక్క సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల పార్టీ ఏజెంట్లు కూడా కచ్చితంగా గుర్తింపు కార్డులు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కౌంటింగ్ విధులు కేటాయించిన సిబ్బందికి త్రాగునీరు, భోజన సౌకర్యం కల్పించడంలో ఆర్వోలు మందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. సాయంత్రం 4 గంటలకల్లా ఫలితాలు వెల్లడించేలా చర్యలు ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ధ్యాన చంద్ర, తిరుపతి మునిసిపల్ కమిషనర్ అదితిసింగ్, డి ఆర్ ఓ పెంచల్ కిషోర్, ఈ వి ఎం నోడల్ అధికారి కోదండరామిరెడ్డి, ట్రైనింగ్ నోడల్ అధికారి రామ్మోహన్, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి సుశీల దేవి, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, వెంకటగిరి గూడూరు, రిటర్నింగ్ అధికారులు నిశాంత్ రెడ్డి రవిశంకర్ రెడ్డి, చంద్రముని, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News