-ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పూర్తిస్థాయిలో సంతృప్తి
-భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, విష్ణు కాలేజీ లలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లను, కౌంటింగ్ కేంద్రాలను, పరిశీలించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
-ఓట్ల లెక్కింపు చేపట్టిన చర్యలను వివరించిన పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
-భద్రతా ఏర్పాట్లను వివరించిన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజిత వేజెండ్ల
పశ్చిమగోదావరి జిల్లా (భీమవరం), నేటి పత్రిక ప్రజావార్త :
మే 30 గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం విచ్చేసి, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజిత వేజెండ్ల, జిల్లా జాయింట్ కలెక్టర్ సి.వి.ప్రవీణ్ ఆదిత్య, భీమవరం ఆర్వో కె.శ్రీనివాసులు రాజు, తాడేపల్లిగూడెం ఆర్వో కె.చెన్నయ్య, ఆచంట ఆర్వో వి. స్వామి నాయుడు, పాలకొల్లు ఆర్ఓ బి.శివనారాయణ రెడ్డి, నరసాపురం ఆర్ఓ యం.అచ్యుత అంబరీష్, తణుకు ఆర్ఓ బి.వెంకటరమణ, తదితరులతో కలిసి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, విష్ణు కళాశాలల్లో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు ఇప్పటికే చేసిన, చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద చేసిన మూడంచెల భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. చివరిగా మీడియా సెంటర్ ఏర్పాట్లను పరిశీలించారు.
ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా,జవాబుదారీతనంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు చేపట్టిన చర్యలను కలెక్టర్ సుమిత్ కుమార్ వివరించారు. సుమారు వెయ్యి మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు తదితరులతో పాటు దాదాపు 400 మంది ఇతర సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియ అనుబంధ విధుల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని.. సూక్ష్మ పరిశీలన, సీసీ కెమెరాల నిఘా మధ్య ప్రక్రియను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడా ఎలాంటి గందరగోళానికి తావులేకుండా సరైన విధంగా బ్యారికేడింగ్, సూచిక బోర్డులు ఏర్పాటు, వాహనాల పార్కింగ్, మీడియా కేంద్రం ఏర్పాటు, రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడి ప్రణాళిక, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు అవసరమైన ఏర్పాట్లు, మార్గదర్శకాల మేరకు కౌంటింగ్ టేబుళ్ల ఏర్పాటు తదితర అంశాలను వివరించారు. అధికారులు, సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు తదితరులకు అల్పాహారం, భోజనం, తాగునీరు వంటి ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల్లోని ఓట్లను లెక్కించే ప్రక్రియలో భాగస్వాములుకానున్న కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు తదితరులకు నాణ్యమైన శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్ వివరించారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద సుమారు 500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో తీసుకున్న చర్యలు, కట్టుదిట్టమైన భద్రత, బందోబస్తుకు చేసిన ఏర్పాట్లను జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అజిత వేజెండ్ల వివరించారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పలు సూచనలు చేస్తూ సమిష్టి కృషితో పశ్చిమగోదావరి జిల్లాలో పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో అదే స్ఫూర్తితో కీలకమైన కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు చర్యలను చేపట్టాలన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రాలకు అనుమతించాలని ఆదేశించారు. కళాశాల ప్రవేశ ద్వారం నుంచి 100 మీటర్ల దూరంలో వాహనాలను నిలిపివేయాలని చెప్పారు. సెల్ ఫోన్ లు, ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించరాదని ఆదేశించారు. స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్టమైన భద్రత కొనసాగించాలన్నారు. ఎక్కడ ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు సూచనలు చేశారు. అధికారులు, సిబ్బంది, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు తదితరులకు చేయాల్సిన ఏర్పాట్లతో పాటు అత్యంత కీలకమైన భద్రతా ఏర్పాట్లపై మార్గనిర్దేశం చేశారు. రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు, జాప్యం లేకుండా ఫలితాల వెల్లడికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.
తొలుత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దు లోసరి వద్ద జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పుష్ప గుచ్చాన్ని అందజేసే సాధనంగా స్వాగతం పలికారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెంట జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయ భాస్కరరావు, అదనపు ఎస్పి వి.భీమారావు, సెబ్ అదనపు ఎస్పీ ఎ.టి.వి.రవికుమార్, డిఎస్పి లు, రెవెన్యూ, పోలీస్ అధికారులు, తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News