మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నానికి త్వరలో చాలా పరిశ్రమలు రాబోతున్నాయని, లక్ష మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని రహదారులు భవనాలు అతిధి గృహంలో మంత్రి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చాలామంది పారిశ్రామికవేత్తలు మచిలీపట్నంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వస్తున్నారన్నారు. అందులో భాగంగానే కోట్లాది రూపాయలతో బిపిసిఎల్ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు కాబోతున్నదన్నారు. అలాగే విద్యుత్తు, బ్యాటరీల స్టోరేజీ తదితర పరిశ్రమలు నెలకొల్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా భావించి తాము పని చేస్తున్నామని ప్రజలందరూ సహకరించాలన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కు (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్) చట్టం వలన నిజమైన హక్కుదారుడు చాలా నష్టపోయే ప్రమాదం ఉందని గుర్తించే తమ ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసిందన్నారు.
మచిలీపట్నం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజీ మురుగునీటి వ్యవస్థ సరిగా లేదని, చెత్తాచెదారం పేరుకుపోయి ఉందని, కొన్ని డివిజన్లో కాలువల నుండి పూడికలను తొలగించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామని త్వరలో అన్నిచోట్ల చేపట్టి పారిశుధ్యం మెరుగుపరుస్తామన్నారు. త్వరలో అంతర్గత రహదారులు, ఆర్ అండ్ బి రహదారులు అన్నీ కూడా చేపట్టి బాగు చేస్తామన్నారు. అమృత్ పథకం కింద 58 కోట్ల రూపాయల వ్యయంతో మచిలీపట్నంను అభివృద్ధి పరుస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎంపీ లాడ్స్ మరికొన్ని నిధులతో పట్టణంలో ప్రణాళిక బద్ధంగా పలు అభివృద్ధి పనులు చేపట్టి మంచి నగరంగా తీర్చి దిద్దుతామన్నారు.
Prajavartha Online Telugu News