-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఇసుక లభ్యతను ప్రజలకు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం అమరావతి నుండి…నూతన ఇసుక పంపిణీ విధానంపై ..మైన్స్ మరియు జియాలజి ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో సమీక్షించగా విసి అనంతరం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ (డిస్టిక్ లెవెల్ స్యాండ్ కమిటీ) సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఎస్.పి సుబ్బారాయుడు తో కలిసి నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో ప్రస్తుతం కోయంబేడు , సూళ్లూరుపేట స్టాక్ పాయింట్లలో ఇసుక అందుబాటులో కలదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జూలై 8న విడుదల చేసిన ఇసుక విధానం జీవో ఎంఎస్ నెంబర్ 43 మేరకు ఇసుక విధానంను పగడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. ఈ ఇసుక విధానంను జిల్లా లో సమర్థవంతంగా అమలు చేసేందుకు ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీ లోని సభ్యులు అందరూ సమన్వయంతో స్టాక్ యార్డ్ ను, అక్రమ రవాణాను అరికట్టడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జిల్లా స్థాయి కమిటీ నే కాకుండా నియోజకవర్గ మండల స్థాయి కమిటీలు కూడా సమర్థవంతంగా పనిచేయాలన్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబి) ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో అంతర్రాష్ట్ర చెక్ పోస్టు ల వద్ద పటిష్ట మైన నిఘా వ్యవస్థ ను ఏర్పాటు చేయాలన్నారు. అంతే కాకుండా ఎడ్లబండ్ల మీద అక్రమంగా ఇసుక రవాణా, నిల్వలు ఉన్న ఎడల వారికి అపరాధ రుసుము విధించబడుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో డి.ఆర్. ఓ పెంచల కిషోర్, అడిషనల్ ఎస్.పి వెంకట్రావు , సెబ్ అదనపు ఎస్పీ రాజేంద్ర, ఈఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అశోక్ కుమార్, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, గూడూరు ఆర్ డి ఓ లు రవి శంకర్ రెడ్డి, చంద్రమునీ, కిరణ్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ అధికారి విజయ్ కుమార్, జిల్లా రవాణా అధికారి ఆదినారాయణ భూగర్భ గనుల శాఖ అధికారి ప్రకాష్ కుమార్, డిపిఓ సుశీలాదేవి ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు..
Prajavartha Online Telugu News