-25 కిలోల బియ్యం నిత్యవసర సరుకులను పంపిణీ చేసిన..
-సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారీ వర్షాలు వరదలు కారణంగా గోదావరి ఉదృతికి బ్రిడ్జిపేట వాసులను పునరాస కేంద్రాలకు తరలించి వారికి రు. 3 వేల రూపాయలతో పాటు బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ చేశామని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు అన్నారు. శనివారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారి ఆలయం దగ్గరలో వున్న చందా సత్రం పునరావాస కేంద్రంలోని గోదావరి వరద బాధితులను బియ్యం, నిత్యావసర వస్తువులను స్థానిక నాయకులు, అధికారులతో కలసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి వరద ఉదృతిని దృష్టిలో ఉంచుకొని అధికారులను అప్రమత్తం చేసి బ్రిడ్జి పేట ఇతర లోతట్టు ప్రదేశాల్లో ఉన్న వరద బాధితులను పునరావాస కేంద్రాలు చందా సత్రం, ఆల్కాట్ గార్డెన్స్ లో వసతి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. వీరందరికీ నాణ్యమైన ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రాత్రి భోజనం సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు.
శాసనసభ సమావేశంలో వరద బాధితుల ఆదుకోవాలనే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించారన్నారు. గతంలో పునరావాసంలో ఉన్న వారికి రు.2వేల రూపాయలు మాత్రమే ఇచ్చే వారిని ప్రస్తుతం దాన్ని రు. 3 వేలు చేసి అందిస్తున్నామన్నారు. దీంతోపాటు మరో రు. 2 వేల రూపాయలు విలువగల నిత్యావసర వస్తువులు ఒకొక్క కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు పామ్ ఆయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళా దుంపలు వంటి ఐదు నిత్యావసర సరుకులు పంపిణీ చేసామన్నారు.
వరద బాధితుల అంశాన్ని రాష్ట్రం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే వరద బాధితులను ఆదుకునే విధంగా ఆర్థిక సహాయాన్ని అందించారన్నారు.. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బాధితులను పరామర్శించి వారి యొక్క ఇబ్బందులు తెలుసుకున్నారు. వీరికి కావలసినటువంటి సదుపాయాలను సమకూరుస్తామని తెలియజేశారు. శాసనసభ్యుల వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజలు తదితరులు వున్నారు.
Prajavartha Online Telugu News