విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సిపిఐ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు షుమారు 5 లక్షలు విలువచేసే బియ్యము, నూనె, దుప్పట్లు, టవల్స్ తదితర సామాన్లను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పంపిణీ చేయడం జరిగింది. విజయవాడ వరద బాధితుల సహాయార్థం సిపిఐ ప్రకాశం జిల్లా సమితి వసూలు చేసిన సామాగ్రిని శుక్రవారం విజయవాడ, దాసరి భవన్ వద్ద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య. అక్కినేని వనజలు వరద బాధితులకు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ బుడమేరు వరద కారణంగా విజయవాడ నగరం అతలాకుతలమైందన్నారు. ప్రజల ఆస్తులు పూర్తిగా వరదలో కొట్టుకుపోయాయన్నారు. ప్రజలు కట్టుబట్టలతో మిగిలారన్నారు. తినటానికి తిండి లేక, తాగటానికి నీరు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, ప్రజలు బురద నీటిలో దోమలతో సహజీవనం చేయలేక అల్లాడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, దాతలు స్పందించి సాయమందించేందుకు ముందుకు వచ్చినప్పటికీ అవి పూర్తిస్థాయిలో అందలేదన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వరద సాయం తక్షణమే అందించడం మానివేసి, కేవలం లెక్కలు వేసేందుకే పరిమితమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సర్వం కోల్పోయిన వరద బాధితులకు అధిక మొత్తంలో నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వరద బాధితులకు సాయం అందించడంలో సిపిఐ ముందు వరుసలో ఉందన్నారు. వరద బాధితులను ఆదుకున్న ప్రకాశం జిల్లా సిపిఐ జిల్లా సమితికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ కోటేశ్వరరావు, ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లాల కార్యదర్శులు ఎంఎల్ నారాయణ, దోనేపూడి శంకర్, విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, ప్రకాశం జిల్లా నాయకులు పివిఆర్ చౌదరి, వై. రవీంద్రబాబు, కె వీరా రెడ్డి, సయ్యద్ యాసిన్, కొత్తకోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News