మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ బిల్లుల ఖర్చులను తగ్గించుకునేందుకు పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని వినియోగించుకుని లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా ప్రజలను కోరారు. శుక్రవారం సాయంత్రం ఆయన సబ్సిడీతో కూడిన సౌర విద్యుత్ పథకం వినియోగంపై విద్యుత్ శాఖ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా విస్తృత అవగాహన పరచాలని సూచించారు.
అనంతరం కలెక్టర్ జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఒక వినూత్నమైన పథకమని, ఇది దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరమన్నారు. ఈ పథకం కింద ఇంటి పైన సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ అమర్చుకోవచ్చని, తద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఇంటి అవసరాలకు ఉపయోగించుకోవచ్చన్నారు. గృహ అవసరాలకు వినియోగించుకోగా మిగులు సోలార్ విద్యుత్తుకు ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీసిపిడిసిఎల్) ప్రతి యూనిట్కు రూ.2.09 పైసలు తిరిగి ఆ వినియోగదారుడికి చెల్లిస్తుందని తెలిపారు.
ఈ పథకం వినియోగం కోసం వారి పరిధిలోని జూనియర్ లైన్మెన్ లేదా ఎనర్జీ అసిస్టెంట్ ని సంప్రదించాలని, వారు అందుకు సంబంధించిన పూర్తి సమాచారం అందిస్తారన్నారు. దీనికి ప్రత్యేకంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణను నోడల్ అధికారిగా నియమించామని, ఎలాంటి సమాచారం కావాలన్నా 9440812104 ఫోన్ నెంబరులో సంప్రదించాలని సూచించారు. సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ కెపాసిటీ 1 నుంచి 2 కిలో వాట్స్, 2 నుంచి 3 కిలో వాట్స్, మూడు కిలో వాట్స్ పైన ఉండే కెపాసిటీలలో సోలార్ రూఫ్ టాప్ లను ఏర్పాటు చేసుకోవచ్చని, ఇందుకు రూ.30 వేల నుంచి రూ.78 వేల వరకు పథకం ద్వారా ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందవచ్చన్నారు.
ఇది ఎంతో మంచి పథకం అని, ఒకసారి ఇంటి పైన సోలార్ రూఫ్ టాప్ ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా సంవత్సరాల తరబడి దాని నుంచి లబ్ది పొందవచ్చని తెలిపారు. సౌర విద్యుత్ శక్తిని పెంపొందించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాలని కలెక్టర్ కోరారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కరరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News