బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ ప్రాంతాలలో సైతం నాణ్యమైన విద్యుత్ ను నిరంతరం సరఫరా అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. యద్దనపూడి మండలం యనమదల గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి రవికుమార్, శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి కలిసి శనివారం భూమి పూజ నిర్వహించారు. అనంతరం అంగన్వాడి కేంద్రంలోని ఇరువురి చిన్నారులకు అన్న ప్రాశనం చేపట్టారు. యనమదల గ్రామంలో రూ.2.80 కోట్ల నిధులతో నిర్మించనున్న 33/11 విద్యుత్ ఉపకేంద్రం పనులకు మంత్రి భూమి పూజ నిర్వహించారు. యనమదల గ్రామం బీసీ కాలనీలో రూ.65 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించనున్న సిసి రోడ్లు, సైడుకాల్వల నిర్మాణాలకు భూమి పూజ చేశారు.
విద్యుత్ సరఫరాలో ఎదురయ్యే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నామని మంత్రి రవికుమార్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇప్పటికే 15 వేల కనెక్షన్లు ఇచ్చామన్నారు. పర్చూరు నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. త్వరలో విద్యుత్ కండక్టర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఏడు గ్రామాలకు విద్యుత్ ఉప కేంద్రం ద్వారా నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు. యద్దనపూడి మండల అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమ కార్యక్రమాలనే చేపడుతుందని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులనే చేపడుతుందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి నిధులు విడుదల చేయడం అభినందనీయమన్నారు. యద్దనపూడి ప్రజలకు విద్యుత్ సమస్యలన్నీ తీరిపోతాయన్నారు. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్వగ్రామమైన యద్దనపూడిపై ప్రత్యేకంగా మమకారం చూపి అభివృద్ధికి సహకరిస్తున్నారని అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి, ఆర్డీవో జి. రవీందర్, విద్యుత్ శాఖ ఎస్ఈ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News