-నేడు 13 వేల పెండింగ్ ఖాతాల్లో 15 కోట్ల రూపాయల ఆర్థిక సాయం జమ ….
-బ్యాంకు ఖాతాల సమస్యలను ప్రభుత్వమే పరిష్కరించింది.
-అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందుతుంది.
-ఎవరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
-జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ప్రభావిత ప్రాంతాల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పరిహారానికి సంబంధించి ఇప్పటివరకు 1.71 లక్షల మంది లబ్ధిదార కుటుంబాలకు 281 కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. వివిధ సమస్యల వల్ల పెండింగ్ లో ఉన్న 13 వేల కుటుంబాలకు సంబంధించి వారి ఖాతాలను సరిచేసుకోవడం వల్ల దాదాపు 15 కోట్లు పరిహారాన్ని వారి ఖాతాలకు సోమవారం జమ చేశామన్నారు. 13వేల కుటుంబాలకు సంబంధించి ఖాతాలను సరి చేసుకోవడం వల్ల పరిహారాన్ని వారి ఖాతాలకు నేరుగా జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఖాతా మనుగడలో లేకపోవడం, బ్యాంకు ఖాతాకు మొబైల్ నెంబరు, ఆధార్ తో బ్యాంక్ ఖాతా అనుసంధానం, మరణించిన వారి పేరిట బ్యాంక్ ఖాతా ఉండడం, మైనర్ పేరిట ఉండడం తదితర కారణాలవల్ల పరిహారం అందజేయడంలో ఇబ్బంది ఎదురైనట్లు గుర్తించి వాటిని 179 సచివాలయాల కార్యదర్శులు ఆయా కుటుంబాలను సంప్రదించి సరిచేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పరిహారం కోసం కలెక్టరేట్లో సమర్పించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోందని అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని, అర్హత ఉన్నవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ సృజన స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News