గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్యం అందించేందుకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టామని, అధికారులు, సిబ్బంది పనితీరు మార్చుకొని విధుల పట్ల అంకిత భావంతో కృషి చేయకుంటే కఠిన చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం 5:30 గంటలకు పట్టాభిపురం మస్టర్ పాయింట్ ని తనిఖీ చేసి, కార్మికుల హాజరు, సెలవుల నమోదు రిజిస్టర్లను పరిశీలించి, తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్యం అందించడం కోసం 90 రోజుల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టామన్నారు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ద్వారా నగరంలో మార్పు కనిపించాలని, అందుకు తగిన విధంగా అధికారులు, సచివాలయ కార్యదర్శులు, ప్రజారోగ్య కార్మికులు కృషి చేయాలన్నారు. కేటాయించిన విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పట్టాభిపురం మస్టర్ పాయింట్ లో కార్మికులు సెలవులు తీసుకున్న రోజులకు, రిజిస్టర్ లో నమోదు చేసిన రోజులకు వ్యత్యాసం గమనించి, ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పని విధానంలో మార్పు రావాలని, ప్రజారోగ్య కార్మికులకు ఉదయం 5:30, మధ్యాహ్నం 2:30 గంటలకు మస్టర్ కార్యాలయంలోనే ఐరిష్ ద్వారా హాజరుని కార్యదర్శులు తీసుకోవాలని ఆదేశించారు. స్పెషల్ శానిటేషన్ పర్యవేక్షణ అధికారులు తప్పనిసరిగా మస్టర్ పరిశీలించడం, క్షేత్ర స్థాయిలో పారిశుధ్య పనులను తనిఖీ చేయాలన్నారు.
అనంతరం అరండల్ పేట మెయిన్ రోడ్ డ్రైన్లలో పూడిక తీత పనులను పరిశీలించి, పూడికతీత సమగ్రంగా చేపట్టాలన్నారు. డ్రైన్ల మీద ఆక్రమణలు, ర్యాంప్ లు ఉంటే తొలగించుకోవాలని సదరు యజమానులకు తెలియచేయాలని, వారు స్పందించకుంటే వాటిని పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. లాలాపేటలో పలు ప్రాంతాలను పరిశీలించి డ్రైన్ లు రోడ్ క్రాసింగ్ పాయింట్ల వద్ద కల్వర్ట్ నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని, అంతర్గత డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని అధికారులను ఆదేశించారు.
పర్యటనలో స్పెషల్ శానిటేషన్ పర్యవేక్షణ అధికారులు సుందర్రామిరెడ్డి, నాగ భూషణం, రమేష్ బాబు, కార్పొరేటర్ చిస్టి, ఏఈ సునీల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్లు భాస్కర్, ఐజాక్, మనోహర్ బాబు, సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News