-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవాలి
-మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుని, ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
శనివారం ఉదయం నగరంలోని జడ్పీ కన్వెన్షన్ హాల్లో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఏర్పాటుపై జిల్లాలోని యువ పారిశ్రామికవేత్తలకు నిర్వహించిన కార్యశాలలో మంత్రి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ విధమైన కార్యక్రమం నిర్వహించటం రాష్ట్రంలోనే మొదటిదని పేర్కొన్నారు.
అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసిన ఘనత దేశంలోని ఆంధ్రప్రదేశ్ కు దక్కిందని, అలాంటి చరిత్ర సృష్టించగల నేర్పు, నైపుణ్యం జిల్లా పారిశ్రామికవేత్తలు పుణికిపుచ్చుకుని ముందుకు సాగాలన్నారు.
ప్రపంచీకరణ కారణంగా మార్కెట్ రంగంలో పోటీ తత్వం పెరిగిందని, వస్తువు సేవల తయారీ, మార్కెటింగ్ లపై ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుటలో నైపుణ్యం పెంపొందించుకోవడం ద్వారా అభివృద్ధి దిశగా పయనించడానికి అవకాశం ఉంటుందన్నారు.
ఆ దేశ పారిశ్రామిక విధానాలతో చైనా ఎంతో అభివృద్ధిని సాధించిందన్నారు. ఈ క్రమంలో దేశాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లటానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు వినూత్నమైన పథకాలను రూపొందించి యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నారన్నారు.
పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న రాయితీలను సక్రమంగా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆ పరిశ్రమలు అభివృద్ధి చెంది ఆర్థికంగా బలపడటంతో పాటు ఎంతోమందికి ఉపాధిని కల్పించడానికి అవకాశం ఉంటుందన్నారు.
రానున్న కాలంలో బందరు పట్టణానికి మంచి రోజులు రానున్నాయని, డిసెంబర్ 2025 నాటికి మచిలీపట్నం పోర్టు నిర్మాణాన్ని పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆ ప్రాంతంలో అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయటానికి ఎంతో ఆస్కారం ఉంటుందని, ఆ అవకాశాన్ని అందుపుచ్చుకోవాలని మంత్రి సూచించారు.
ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక శ్రామిక విధానాన్ని తీసుకొచ్చారని, దాని ప్రకారం ప్రతి నియోజకవర్గంలో వంద ఎకరాలలో ఎంఎస్ఎంఈ పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసి అన్ని వర్గాల వారికి శిక్షణ నిచ్చి పరిశ్రమలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు.
త్వరలో మచిలీపట్నం నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేస్తామని, సంవత్సరానికి కనీసంగా 50 పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు ముందుకు వేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు.
మచిలీపట్నంలో ఇప్పటికే ఉన్న జ్యువలరీ పార్క్ కు అదనంగా త్వరలో మరొక జ్యువలరీ పార్కును ఏర్పాటుచేసి కొత్తవారికి అవకాశం ఇస్తామన్నారు.
వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించిఎరువులు, పురుగుమందుల పిచికారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డ్రోన్ దీదీ పథకం ఉపయోగించుకుని మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు.
రాష్ట్రంలో జిల్లాను ప్రత్యేక స్థానంలో నిలపాలనే లక్ష్యంతో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ జిల్లా కలెక్టర్ అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ ఒక వ్యక్తి పారిశ్రామికవేత్తగా ఎదిగితే ఎంతోమందికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుందన్నారు. క్రమశిక్షణతో కష్టపడి పని చేస్తే కచ్చితంగా వ్యాపారంలో రాణించటానికి ఎంతో ఆస్కారం ఉంటుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలతో కూడిన ఎన్నో ప్రోత్సాహకాలను అందిస్తోందని, అవకాశాలను అందిపుచ్చుకుని అంచలంచెలుగా పైకి ఎదగాలని ఆశించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏ దేశమైనా అభివృద్ధి సాధించాలంటే చదువు, పరిశ్రమల ఏర్పాటు ఎంతో కీలకమన్నారు. ఆ రోజుల్లో పరిశ్రమల అభివృద్ధికి సౌకర్యాలు తక్కువగా ఉన్నప్పటికీ అభివృద్ధి చెందాయని,కానీ ప్రస్తుత రోజుల్లో పరిశ్రమల ఏర్పాటుకు సకల సౌకర్యాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జీవితంలో ఎదగాలని కసి ఉంటే సామాన్యులు అసమాన్యులుగా ఎదుగుతారని, ఓపికతో కష్టపడి పని చేస్తే ఏదో ఒక రోజు జీవితం మలుపుతిరిగి విజయం సాధిస్తాం అన్నారు.
రిలయన్స్ అధినేత దిగంగత ధీరుభాయ్ అంబానీ మొదటగా పెట్రోల్ బంకులో పనిచేసి ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపారవేత్తగా ఎదిగారని గుర్తు చేస్తూ, అగరబత్తుల వ్యాపారవేత్త నారాయణ రంగారావు, లిజ్జత్ పాపడ్ బ్రాండ్ మహిళా వ్యాపారవేత్త వ్యాపారాలలో రాణించిన వారందరూ ఒకప్పుడు సామాన్యులేనని, కానీ అంచలంచెలుగా వారి వ్యాపార రంగంలో రాణించారని గుర్తు చేశారు. అలాంటి గొప్ప వారిని యువ పారిశ్రామికవేత్తలు ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
కార్యక్రమానికి ముందు మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకల్లు నారాయణ, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఇతర అధికారులతో కలిసి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కలంకారి వస్త్రాలు, లేపాక్షి కళాఖండాలు, మెప్మా, డి ఆర్ డి ఏ సంస్థల మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ ఆర్ వెంకట్రావు ఏపీ ఎంఎస్ఎంఈడిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి, ఎంఎస్ఎంఈ ఫ్యాకల్టీ మెంబర్ వి స్వప్న, రిలేషన్షిప్ మేనేజర్ ఇమాని అభయ్ కృష్ణ, పశుసంవర్ధక శాఖ అధికారి చిన్న నరసింహులు, మత్స్య శాఖ అధికారి చంద్రశేఖర్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, రాష్ట్ర బీసీ మాజీ అధ్యక్షులు బొడ్డు వేణుగోపాలరావు, కూటమి పార్టీ నాయకులు బండి రామకృష్ణ, యువ పారిశ్రామికవేత్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News