మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థుల్లో పట్టుదల, కృషి ఉంటే ఋషులవుతారని, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు కష్టపడి లక్ష్యాలను సాధించాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర యువతకు ఉద్బోధించారు. స్థానిక హిందూ కళాశాల మైదానంలో శుక్రవారం నుంచి జరుగుతున్న యువ కెరటాలు కార్యక్రమంలో శనివారం సాయంత్రం మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, విశ్రాంత న్యాయమూర్తి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని యువతలో స్ఫూర్తిని నింపారు. అనంతరం వివిధ అంశాలలో నిర్వహించిన పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టుదల ఉంటే అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థానానికి ఎదగవచ్చనడానికి ప్రత్యక్షంగా మన ముందున్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రతి ఒక్కరికీ ఆదర్శం అన్నారు. మారుమూల ప్రాంతంలో పుట్టి, ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసి ఐఏఎస్ అయ్యారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అభిలాషించారు. జీవితంలో ఎదగటానికి పెట్టుబడి అవసరం లేదని, మంచి ఆలోచన కలిగి ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని యువతకు సూచించారు.
సోషల్ మీడియా.. డ్రగ్స్ యువతకు ప్రమాదం… : జిల్లా కలెక్టర్
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువతకు సోషల్ మీడియా, డ్రగ్స్ వినియోగం రెండూ ప్రమాదకరంగా మారాయని అన్నారు. అవసరం మేరకే సోషల్ మీడియాను వినియోగించాలని, ఎక్కువ సమయాన్ని కేటాయించి తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని, డ్రగ్స్ జోలికి పోవద్దని సూచించారు. జీవితంలో పుట్టుకతో ఎవరూ ధనవంతులుగా లేదా తెలివి తేటలు కలిగిన వారిగా జన్మించరని, లక్ష్యసాధనతోనే గొప్పవారుగా ఎదుగుతారన్నారు. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకున్న వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని యువతలో స్ఫూర్తిని నింపారు. తాను విద్యార్థి దశ నుంచి ఐఏఎస్ వరకు లక్ష్యాన్ని సాధించిన తీరును ఆయన ఈ సందర్భంగా విద్యార్థులతో పంచుకున్నారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులు తమ నృత్య ప్రదర్శనలతో ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బండి రామకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News