-ఎంపికి వినతి పత్రం అందించిన ఓఎస్డి డాక్టర్ వెలగా జోషి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ఎంపి కేశినేని శివనాథ్ హామీ ఇచ్చారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓఎస్డి డాక్టర్ వెలగా జోషి ఆదివారం ఎంపి కేశినేని శివనాథ్ ను కలిసి రాష్ట్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించాలని వినతి పత్రం అందజేశారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, ఇప్పటివరకు ప్రభుత్వం దగ్గర జరిగిన చర్చలు, సమీక్షలకు సంబంధించిన సమగ్ర నివేదికను కేశినేని శివనాథ్ కి డాక్టర్ వెలగా జోషి అందజేశారు. నివేదికను పరిశీలించిన తర్వాత కేశినేని శివనాథ్ సానుకూలంగా స్పందించారు.
విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం 10వ షెడ్యూల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది. పది సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించిన విద్యార్థులకు ప్రవేశాలు ఇవ్వటం లేదు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుమారు 30 వేలకు పైగా విద్యార్థులు నష్టపోతున్న విషయాన్ని కేశినేని శివనాథ్ దృష్టికి డాక్టర్ వెలగా జోషి తీసుకెళ్లారు.
అంతేకాకుండా విద్యార్థులు నష్టపోవడం రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని కోల్పోవడం వంటి అంశాలను వెలగ జోషి ఎంపీకేశినేని శివనాథ్ తో చర్చించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేశినేని శివనాథ్ ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు .రాష్ట్రంలో ఉన్న 30 వేల మంది ఓపెన్ యూనివర్సిటీ ద్వారా విద్యను పొందే అవకాశం ఉన్నప్పుడు వారందరికీ తగిన న్యాయం జరిగే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. విద్య విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని నాణ్యమైన విద్యను అందరికీ అందించటమే ధ్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. ఇప్పటికే విద్యలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి అమలు చేస్తున్నామని ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు.
Prajavartha Online Telugu News