Breaking News

కూటమి ప్రభుత్వం సినిమాలను రాజకీయం చేయదు

-చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పులమడం మాకు ఇష్టం లేదు
-చిత్ర పరిశ్రమ మీద ఎన్డీఏ ప్రభుత్వానికి గౌరవం ఉంది
-గత ప్రభుత్వం మాదిరి టిక్కెట్ల ధరల కోసం హీరోలు రావాలని పిలవం
-టిక్కెట్ల ధర పెంపు వల్ల ప్రభుత్వానికీ ఆదాయం వస్తుంది
-ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చిత్ర పరిశ్రమ అభివృద్ధికే దోహదపడ్డారు
-తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుంది
-రాంచరణ్ మూలాలను మరచిపోకుండా ఎదిగాడు
-గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పులమడం మాకు ఇష్టం లేదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అండగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమ మీద గౌరవం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చిత్ర పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుంది తప్ప ఎవ్వరినీ ఇబ్బందపెట్టబోద’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. టిక్కెట్ల ధరలు పెంచేందుకు గత ప్రభుత్వం మాదిరి హీరోలని పిలవబోమని అన్నారు. టిక్కెట్ల ధరలు పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా టాక్స్ రూపంలో ఆదాయం వస్తుందని, కొంత మంది ధరల పెంపుని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. చిత్ర పరిశ్రమ గురించి సినిమాలు తీసేవారు మాత్రమే మాట్లాడాలని సూచించారు. శనివారం సాయంత్రం రాజమండ్రిలో గ్లోబల్ స్టార్ శ్రీ రాంచరణ్ గారు నటించిన గేమ్ ఛేంజర్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసే వారు నాకు నచ్చరు. తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలి అంటే సినిమాలు తీసి దాని సాదకబాధకాలు తెలిసిన వారే మాట్లాడాలి. ఎన్డీఏ ప్రభుత్వం తరఫున చెబుతున్నాను. టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వారితోనే మాట్లాడుతుంది. వారినే గుర్తిస్తుంది. సినిమా టిక్కెట్ల ధరలు పెంచేందుకు హీరోలతో పని ఏంటి? హీరోలు ఎందుకు రావాలి? అలా హీరోలని రప్పించుకోవడం మాకు ఇష్టం లేదు. నిర్మాతలు, ట్రేడ్ బాడీ యూనియన్ వచ్చినా టిక్కెట్ల ధరలు పెంపు ఇస్తాం. గత ప్రభుత్వంలో మాదిరి హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలని ఆలోచించే లో లెవల్ వ్యక్తులం కాదు.
మేము స్వర్గీయ ఎన్టీఆర్  నుంచి చాలా నేర్చుకున్నాం. ఆయన్ని ఎంత మంది విమర్శించినా కలసి నటించేప్పుడు బాగున్నారా అని గుండె నిండుగా పలుకరించేవారు. ఎన్టీఆర్ ప్రభుత్వం కృష్ణ  లాంటి వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఎప్పుడూ ఇతర హీరోల మీద వివక్ష చూపలేదు. చిత్ర పరిశ్రమ తాలూకు ఔన్నత్యం అది. దాన్ని మేము కొనసాగిస్తాం.

చంద్రబాబు నాయుడు చిత్ర పరిశ్రమను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు
గత ప్రభుత్వంలో మాదిరి మీరంతా అభిమానించే మెగాస్టార్ చిరంజీవి  లాంటి వారిని గాని, బాహుబలి ప్రభాస్ లాంటి వారిని గాని, ప్రిన్స్ మహేష్ బాబు  లాంటి వారినిగానీ మేము పిలవం. మాకు చిత్ర పరిశ్రమ మీద గౌరవం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఎప్పుడూ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి దోహదపడ్డారు తప్ప తెలుగు చిత్ర పరిశ్రమను ఎప్పుడూ ఇబ్బందిపెట్టలేదు.

సమాజాన్ని ఆలోచింపజేసే సినిమాలు రావాలి
మనం నిజ జీవితంలో చేయలేని వాటిని సినిమాల్లోని పాత్రల్లో ఊహించుకుని చూస్తాం. మననసులో భావన తెరకెక్కించడం వల్లే ఒక్కడు లాంటి సినిమాలు చూస్తాం. ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో శివాజీ లాంటి సినిమాలు చూసి తృప్తిపడతాం. సినిమాలు ఒక మార్గదర్శకం. సినిమాల్లో చాలా విలువలు ఉంటాయి. సినిమాల్లో మంచీ చెడూ రెండూ ఉంటాయి. సినిమాల్లో ఉన్న విలువలు మాత్రమే మనం స్వీకరించాలి. వకీల్ సాబ్ లో ఓ డైలాగ్ నేను చెప్పడానికి ఆలోచించాను. హీరోలు, దర్శకులు సమాజం మీద తీవ్ర ప్రభావం చూపుతారు. సమాజానికి వినోదాన్ని పంచే సినిమాలతోపాటు సమాజాన్ని ఆలోచింప చేసే సినిమాలు రావాలి. ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే, ప్రజలకు మంచి నేర్పే సినిమాలు రావాలని కోరకుంటున్నాను. పెరిగిన టిక్కెట్ల ధరలు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. పెరిగిన ప్రతి రూపాయి మీద 18 శాతం జీఎస్టీ వస్తుంది.

గత ప్రభుత్వంలో నా సినిమాలకు టిక్కెట్ ధర తగ్గించేశారు
సినిమాలకు అడగగానే అసలు టిక్కెట్ ధరలు ఎందుకు పెంచాలి? డిమాండ్ సప్లై సూత్రాన్ని అనుసరించే సినిమా టిక్కెట్ల ధరలు పెంచుతారు. శంకర్ సినిమా నేను బ్లాక్ లో టిక్కెట్లు కొనుక్కుని చూశా. బ్లాక్ లో టిక్కెట్లు కొని సినిమాలు చూస్తే ఆ డబ్బు ఎవరికో వెళ్లిపోతుంది. సినిమాలకు బడ్జెట్లు పెరిగిపోయాయి. పెట్టుబడులు పెరిగిపోయాయి. అయినా టిక్కెట్ ధరలో పెంచిన ప్రతి రూపాయికీ 18 శాతం ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో పన్ను వస్తుంది. దీని మీద తప్పుడు ప్రచారం ఉంది. గత ప్రభుత్వంలో నా సినిమాకి టిక్కెట్ ధరలు పెంచకపోగా తగ్గించేశారు. చాలా మంది హీరోలు కూటమికి కూటమి ప్రభుత్వానికి మద్దతు కూడా తెలపలేదు. అయినా మేము ఎవరిపట్ల వివక్ష చూపలేదు. కూటమి ప్రభుత్వం సినిమాలను రాజకీయం చేయదు. అందరూ బాగుండాలని కోరుకుంటాము.

మన జాతి విశిష్టతను సినిమాలే చూపాలి
ఒక చిన్న పెన్సిల్ తయారీకి అనేక దేశాలకు చెందిన రకరకాల వ్యక్తులు కలిసి రావాలి. గేమ్ ఛేంజర్ సినిమాకి దర్శకులు శంకర్ తమిళ్, నిర్మాత దిల్ రాజు తెలంగాణ, ఒక్కొక్కరు ఒక్కో రాష్ట్రం నుంచి వస్తారు. అందరూ కలసి సినిమా తీసి ఆహ్లాదం కలగజేస్తారు. భారతీయ చిత్ర పరిశ్రమ హాలీవుడ్ నుంచి క్రమశిక్షణ నేర్చుకోవాలి. 90వ దశకం నుంచి టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ అని వచ్చింది. హాలీవుడ్లో నుంచి వుడ్ తీసుకున్నాంగాని ఆ పరిశ్రమ క్రమశిక్షణ మాత్రం ఫాలో అవ్వం. స్కిల్ డెవలప్మెంట్ ఫాలో అవ్వం. మనకు గొప్ప గొప్ప కావ్యాలు రాసిన కవుల, కళాకారులు ఉన్నారు. మన జాతి తాలూకు విశిష్టతను సినిమాలే చూపాలి. హాలీ వుడ్ ను అనుకరించడం మానేయాలి. మనదైన సత్తా, మనవైన కథలు రావాలి.

యువతకు చిత్రపరిశ్రమ ద్వారా ఉపాధి కల్పించండి
రాష్ట్రంలో యువత బైకుల్లో తిరిగి గోల చేస్తారు అని అంటారు. ఉద్యోగాలు, ఉపాధి అవ్వడానికి సమయం పడుతున్నప్పుడు గోల చెయ్యక ఏం చేస్తారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఆంధ్ర, తెలంగాణల్లో అద్భుతంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను దిల్ రాజు  లాంటి నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ లో యువతకు స్కిల్ డెవలప్ చేయాలి. స్టంట్ స్కూల్స్ పెట్టాలి. రాజమౌళి,  త్రివిక్రమ్ లాంటి వారు స్క్రీన్ ప్లే క్లాసులు ఇవ్వాలి. కీరవాణి గారు, తమన్ గారు లాంటి వారికి సినిమాకు అనువైన సంగీత పాఠాలు నేర్పమని చెప్పాలి. రాష్ట్రంలో స్టూడియోలు పెట్టండి. చిత్ర పరిశ్రమ ద్వారా యువతకు ఉపాధి కల్పించండి. మేమంతా అండగా ఉంటాం. రాష్ట్రంలో చిత్ర నిర్మాణానికి అనుకూలంగా ఉన్న లొకేషన్స్ గుర్తించండి. ప్రభుత్వం మీకు సౌకర్యాలు కల్పిస్తుంది. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుంది. గేమ్ ఛేంజర్ ఒక సోషల్ మెసేజ్ ఉన్న సినిమా. శంకర్ అద్భుతంగా తెరకెక్కించారు. కొత్త సంవత్సరంలో గేమ్ ఛేంజర్ ద్వారా బాక్సాఫీస్ బద్దలు కావాలి.

అందరి సినిమాలూ బాగుండాలని కోరుకుంటాము
రామ్ చరణ్ ఆస్కార్ కి వెళ్లినా తనను తాను నియంత్రించుకోగలిగిన వ్యక్తి. పదహారణాల తెలుగువాడు. ఒక తల్లికి పుట్టకపోయినా సోదర సమానుడు. ఒక బాబాయ్ గానే కాకుండా అన్నగా చిత్రం ఘన విజయం సాధించాలని కోరుతూ ఆశీర్వదిస్తున్నాను. చిత్ర యూనిట్ మొత్తానికి పేరు పేరునా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సినిమా ఫంక్షన్లు అంటే ఈ మధ్య కాలంలో ఉన్న ఒత్తిడి అందరికీ తెలుసు. అయితే సినిమాని విడుదలకు ముందే పది మంది తెలియజేయాలి. ఈ చిత్రం మూడేళ్లు తీశారు. వారికి దొరికే సమయం పది రోజులే. ఆ సమయంలోనే సినిమా గురించి ఎక్కువ మందికి తెలియజేయాలి. ముందుగా చిన్న ఫంక్షన్ చేద్దామనుకున్నారు. ఇప్పుడు ఇంత పెద్దది అయ్యింది. మా ఇంట్లో ప్రతి హీరో చిత్రం బాగుండాలని కోరుకుంటాం. సర్వేజనా సుఖినోభవంతు అనే భావాన్ని మా నాన్న మాకు అలవాటు చేశారు. అన్నయ్య చిరంజీవి గారు షూటింగ్ చేసి అలసిపోయి ఇంటికి వచ్చి షూ కూడా తీయకుండా అలాగే పడుకుండి పోయేవారు. తండ్రి కష్టాన్ని చూసి… మూలాలను మరచిపోకుండా ఉన్న నటుడు రాంచరణ్. తండ్రి మెగాస్టార్, వారసుడు గ్లోబల్ స్టార్.
ఈ ఫంక్షన్ కి వచ్చిన మీరంతా క్షేమంగా ఇంటికి వెళ్లాలి. ఆనందం విషాదం కాకూడదు. అభిమానులకు చిన్న దెబ్బ తగిలినా నా గుండెకు గాయం అవుతుంది. అంతా క్షేమంగా ఉండాలి” అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్యేలు  గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ,  కొలికపూడి శ్రీనివాస్ రావు, కౌడా ఛైర్మన్ తుమ్మల బాబు, చిత్ర బృందం పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *