గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు సంతోషంగా ఉండటమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పౌర సరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. శనివారం కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో రూ. 1.85 లక్షలతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన గోకుల షెడ్ ను రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గ్రామస్తులు , మహిళలు పండుగ వాతావరణంలోకి తీసుకువచ్చినందుకు మనస్పూర్తిగా జిల్లా యంత్రాంగం తరపున ప్రభుత్వం తరఫున , ప్రత్యేకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమంలో మనందరం భాగస్వామ్యులమేనన్నారు. ప్రస్తుతం మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి టాక్స్ రూపంలో వస్తుందని , ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా కార్యక్రమాలను తీసుకొని వస్తామన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న కొన్ని ఇబ్బందులను లోతుగా అవగాహన తెచ్చుకుని పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పు తీసుకుని రావాలని ముందుకు వచ్చారన్నారు. గత ప్రభుత్వం నిధులు తమ సొంత అవసరాల కోసం వాడుకుని గ్రామీణ వాతావరణాన్ని దెబ్బతీసిందని , గత ఐదు సంవత్సరాలలో ఏ పని చేయలేదన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను పేదరిక నిర్మూలనకు , గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు వేసవికాలంలో పనులు కల్పించేందుకు తీసుకురావడం జరిగిందన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో అత్తోట గ్రామంలో మూడు సీసీ రోడ్లను నిర్మించడం జరిగిందన్నారు. ఈరోజు మినీ గోకులం కింద రూ.1.85 లక్షలతో నిర్మించిన షెడ్డును ప్రారంభించుకుంటున్నామన్నారు. లబ్ధిదారులు 10 శాతం చెల్లించాల్సి ఉందన్నారు. వ్యవసాయానికి అదనంగా పాడి పరిశ్రమ ద్వారా గేదెల పాల ఉత్పత్తి ద్వారా రైతు కుటుంబానికి ఆదాయం వస్తుందన్నారు. రైతు కుటుంబానికి చెందిన పిల్లలను బాగా చదివించుకుంటే కావాల్సిన ఆదాయ వనరులు ప్రభుత్వం నుండి అందిస్తామన్నారు. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు రూ.1670 కోట్లు బకాయి పెట్టిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలు చెల్లించడం జరిగిందన్నారు. రైతులకు వారు పండించిన పంటను ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి 24 గంటల్లో డబ్బు చెల్లించడం జరుగుతుందన్నారు. గ్రామస్తులు ఇంకా ఎవరైనా గోకుల షెడ్లు నిర్మించదలుచుకుంటే దరఖాస్తు చేసుకున్న ఎడల మంజూరు చేయడం జరుగుతుందన్నారు. గోకుల షెడ్డు నిర్మాణానికి అదనంగా 30 నుండి 50 వేల వరకు ఖర్చు అవుతుందని రైతులు తెలియజేయగా, ఈ విషయాన్ని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చి పెంచడానికి ప్రయత్నిస్తామన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి నాబార్డ్ నుండి 25 కోట్లు సీసీ రోడ్ల నిర్మాణానికి శాంక్షన్ చేయించారని పేర్కొన్నారు. అత్తోట గ్రామాన్ని ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దాలని గ్రామస్తులు పిలుపునిచ్చారు. 2012లో రక్షిత నీటి పథకాన్ని తీసుకువచ్చానని కాని గత ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని, ప్రస్తుతం రక్షిత నీటి పథకానికి నిధులు తీసుకురావడం జరిగిందని, ట్యాంకులు పైపులు బాగు చేయించి ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మాట్లాడుతూ పల్లె పండుగలో భాగంగా అక్టోబర్ లో సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభించడం జరిగిందని , సంక్రాంతి పండుగకు పనులు పూర్తయ్యాలా చూడాల్సిందన్నారు. జిల్లాలో పల్లె పండుగ కార్యక్రమం కింద సిసి రోడ్లను గ్రౌండ్ చేయటం జరిగిందని , 170 సీసీ రోడ్లు శాంక్షన్ చేయగా 60 శాతం రోడ్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇంకా పది రోజులలో మిగిలిన రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మినీ గోకులం కింద 386 మందికి షెడ్లు శాంక్షన్ చేయడం జరిగిందని , అందులో 170 మంది షెడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈరోజు అత్తోట గ్రామంలో రూ.1.85 లక్షల ఖర్చుతో నిర్పించిన మినీ గోకులం షెడ్డును ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. నాలుగు పశువుల షెడ్ కి రూ. 1.85 లక్షలు , ఆరు పశువుల షెడ్ కు రూ.2.30 లక్షలు అందించడం జరుగుతుందని, వీటిలో లబ్ధిదారులు 10 శాతం చెల్లించాల్సి ఉందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఇంకా ఎవరైనా గోకులం షెడ్ కొరకు దరఖాస్తు చేసుకుంటే వారికి మంజూరు చేయటం జరుగుతుందన్నారు. గ్రామంలో పండుగ వాతావరణంలో సంక్రాంతి రంగోలి ఏర్పాటు చేయటం చాలా బాగుందని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో పీడీ డ్వామా బి.శంకర్ , కొల్లిపర తహశీల్దార్ జి.సిద్ధార్థ , ఎంపీడీవో ఎం విజయలక్ష్మి , అత్తోట గ్రామ సెక్రెటరీ లక్ష్మి , మండల ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు , ఉప సర్పంచ్ దీవెల ఏడుకొండలు, జనసేన నాయకులు అడప నారాయణరెడ్డి , గోకుల షెడ్ లబ్దిదారు పోలిశెట్టి గంగాధర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం (ఏబీపీ)పై అధికారులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
-పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం బ్లాక్ లను టాప్ టెన్ లో నిలపండి…. -హెల్త్ ,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పై దృష్టి సారించండి….. -కలెక్టర్ …