-అభివృద్ధి లక్ష్యసాధనలో వందశాతం ఫలితాలు సాధించాలి : 20 సూత్రాల అమలు కార్యక్రమ చైర్మన్ లంకా దినకర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగిన 20 సూత్రాల కార్యక్రమాల అమలుపై ఇరవై సూత్రాల కార్యక్రమాల చైర్మన్ లంకా దినకర్ తిరుపతి జిల్లాలో కేంద్ర ప్రయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, తిరుమలకు విచ్చేసే భక్తులకు మరియు పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు స్మార్ట్ సిటీగా తిరుపతి అభివృద్ధి పై జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తో కలసి సమీక్ష నిర్వహించారు.
ప్రధాని నరేంద్ర మోడీ గారి లక్ష్యం వికసితభారత్ 2047 – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో పని చేస్తేనే తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ప్రస్తుత సవాళ్లను అధిగమించి విజయవంతంగా “ వికసిత తిరుపతి“ గా రూపుదిద్దవచ్చునన్నారు ..
సమీక్షలో ఉపాధిహామీపథకం మెటీరియల్ కాంపోనెంట్ వినియోగం మరియు గతంలో జరిగిన అవకతవకలు మరియు ప్రస్తుత అమలు తీరు పైన, జిల్లాలో గ్రామాలలో ప్రతి గృహానికి సురక్షిత త్రాగు నీరు ఇచ్చే సంకల్పంతో జల్ జీవన్ మిషన్ అమలు తీరుపై తిరుపతి పట్టణం లో అమృత్ పథకం నిధుల వినియోగంతో సాధించిన ఫలితాలు, అమృత్ 2.0 లక్ష్యాలను మరియు స్మార్ట్ సిటీ నిధుల వినియోగం పైన, గ్రామీణసడక్ యోజన, లక్ పతి దీదీ, గరీబ్ కళ్యాణ్ అన్నయోజన, పీఎం సూర్యఘర్, కుసుమ్, పీఎంఆవాసయోజన, పీఎం విశ్వకర్మ, మరియు పట్టణ అభివృద్ధి నిధుల వినియోగ ప్రణాళిక, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరుతో పాటు పర్యాటక రంగ మరియు పారిశ్రామికీకరణ అభివృద్ధి అంశాల వారిగా జిల్లా కలెక్టర్ గారు మరియు అధికారులతో సమీక్ష చేయడం జరిగింది.
ఈ సంవత్సరం ఉపాధి హామీలో మెటీరియల్ కాంపోనెంట్ 194 కోట్లలో ఇప్పటివరకు 80 కోట్లు మాత్రమే వ్యయం అయినందున నిధులు మురిగిపోకుండా ప్రణాళికబద్ధంగా ఖర్చు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, అలాగే గత 5 సంవత్సరాలు ఉపాధి హామీ నిధులను నిబంధనలకు వ్యతిరేకంగా ఖర్చు చేసిన వివరాలు ఇవ్వవలసినదిగా అధికారులను చైర్మన్ ఆదేశించారు. గత 5 సంవత్సరాలు జల్ జీవన్ మిషన్ దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత లేకుండా గత ప్రభుత్వంలో పనులు చేయడం వల్ల ప్రధాని నరేంద్ర మోదీ గారు నిర్దేశించిన లక్ష్యాలు జిల్లా చేరుకోలేక పోయిందని మరియు నిధులు దుర్వినియోగం జరిగిందని అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామంలోని ప్రతి కుటుంబానికి దీర్ఘకాలిక నీటి వనరులతో కుళాయి ద్వార సురక్షిత త్రాగు నీరు ఇచ్చే లక్ష్యంతో సవరించిన డీపీఆర్ తో జల్ జీవన్ మిషన్ అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు, జిల్లా కోసం గత 5 సంవత్సరాల అస్తవ్యస్త విధానాలతో కాకుండా వనరుల సద్వినియోగం అయ్యే విధంగా స్పష్టమైన ప్రణాళిక తయారు చేయాలని అధికారులను సూచించారు.
“ గ్రామీణ సడక్ యోజన “ కింద గ్రామాలలో రహదారుల నిర్మాణ పనులు వేగంగా జరగాల్సినటువంటి అవసరం ఉందని అధికారుల దృష్టికి తేవడం జరిగిందని అన్నారు. ఇంకా దీర్ఘకాలంగా మిగిలిపోయిన పాత పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాలో స్వయం సేవ గ్రూపులలోని మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దాలనే “ లక్ పతి దీదీ“ లక్ష్యం నిర్దేశించుకుని వేగంగా ఆ లక్ష్యాలను చేరుకోవాలన్నారు.
పీఎంఏవై క్రింద జిల్లాలో కేటాయించిన 80 వేల గృహలకు గాను పూర్తి అయిన గృహాలు 26 వేలు మాత్రమేనని అందులో పూర్తి అయిన గృహాలలో నివాసయోగ్యమైన మౌలిక సదుపాయాల కల్పన లేక లబ్దిదారులు ఇబ్బంది పడుతున్నారని, వాటికీ కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు వెంటనే చర్యలను తీసుకోవాలని అధికారులకు సూచించారు. టిడ్కోనందు 15 వేలగృహాలలో దాదాపు 80% పూర్తి అయినా చాలా మంది లబ్దిదారులకు గృహాలను ఎందుకు తీసుకోలేదని వాటికీ సంబంధించిన వివరాలను తెలియపరచవలసినదిగా అధికారులను ఆదేశించారు. పట్టణాలలో ప్రతి ఇంటికి సురక్షిత త్రాగు నీటి సరఫరా కోసం తిరుపతి కార్పొరేషన్ కోసం అమృత్ 1.0 క్రింద 2017లో కేటాయించిన నిధులకు సంబంధించిన పనులలో ఇప్పటికి పూర్తికాని పరిస్థితులున్నాయని దానికి కారణం గడచిన 5 సంవత్సరాల అస్తవ్యస్థ విధానాలు అని అన్నారు. ఇప్పుడు అమృత్ 2.0 క్రింద నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధులు సద్వినియోగపరిచి గతంలో పూర్తికాని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
తిరుపతి మునిసిపాలిటి నందు అమృత్ 1.0 లో త్రాగునీటి సరఫరా కోసం 149 కోట్లు, సినరేజ్ & సప్టేజ్ నిర్వహణకు 59 కోట్లు మరియు స్ట్రామ్ వాటర్ డ్రైనేజ్ కోసం 12 కోట్లు మొత్తం 220 కోట్ల విలువైన పనులు పూర్తి అయ్యాయి. తిరుపతి పట్టణంలో మొత్తం 1.58 వేల గృహాలకు గాను ఇప్పటికీ దాదాపు 35% గృహాలకు మాత్రమే సరపరా జరిగిందని మిగిలిన గృహాలకు త్వరితగతిన అమలు అయ్యేలా చూడాలని కోరారు.
అమృత్ 2.0 ప్రతిపాదన వివరాలు :
శ్రీకాళహస్తి : అమృత్ 1.0 లో 26.85 కోట్ల అంచనాతో 7 ఎంఎల్డీ ఎస్టీపి ఏర్పాటు పనులు 56% పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. అమృత్ 2.0 లో ఇప్పుడు 33.50 కోట్ల ప్రతిపాదనలు చేశారు, కానీ పూర్తి కాని ఎస్టీపీ పైన అనుసంధానానికి ప్రతిపాదనలు లేవనీ, ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని అమృత్ 2.0 ప్రతిపాదనలు పంపమని తెలిపారు.
వెంకటగిరికి అమృత్ 2.0 లో ప్రజలకు నీటి సరఫరా కోసం 92 కోట్ల రూపాయిలు ప్రతిపాదనలు పంపడం జరిగిందని, గూడూరు కు 23 కోట్లు, పుత్తూరుకు 13 కోట్లు, వెంకటగిరికి 11 కోట్లు ప్రతిపాదనలు పంపడం జరిగిందని అధికారులు తెలిపారు.
పీఎం సూర్య ఘర్ పథకం అమలులో వేగం పెంచాలని స్వయం సహాయక గ్రూపులతో అనుసంధానం అయ్యి నిర్దేశించిన లక్ష్యాలు అందుకోవాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో 20 సూత్రాల కార్యక్రమాల చైర్మన్ మాట్లాడుతూ..
20 సూత్రాల అమలు అమలుపై సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో ఇంకా “ క్యూ లైన్ “ టికెట్ల జారీ ఎందుకు, ఆన్లైన్ సేవలు వినియోగించి టికెట్లు మరియు టోకెన్ల జారీకి భక్తులకు క్యూలలో వేచి చూసే విధానంకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉందన్నారు.
గడచిన 5 సంవత్సరాలలో వందలాది కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణంతో తిరుపతి నగరపాలక సంస్థ నిర్వహణ అస్తవ్యస్తం చేశారు, దీనిపైన మునిసిపల్ అధికారులను పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
కొరమీను గుంట, పూలవాని గుంట ఆక్రమణ పైన అత్యన్నత న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులు ఎందుకు అమలు కావడం లేదని, దాని పైన చర్యలకు ఆదేశించామన్నారు.
తిరుపతి బోగస్ ఓట్ల వ్యవహారంలో అమాయకులను బలి చేయడం సరి కాదని, అందులోని సూత్రధారులను గుర్తించాలని అధికారులను కోరారు.
తిరుమల వేంకటేశ్వర స్వామివారి నిధుల దుర్వినియోగం పై మున్సిపల్ కార్పొరేషన్ ను అడ్డుపెట్టుకొని అవినీతి ప్రణాళికలు వేసిన వారిపైన ఎలాంటి చర్యలు లేవని, ఇటువంటి అనైతిక విధానాలను వెంకటేశ్వర సామి వారు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ , డిఆర్ఓ నరసింహులు, టీటీడీ బోర్డ్ మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, నాయిబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మెన్ రుద్రకోటి సదాశివం, సంబందిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.