గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని వార్డ్ ల వారీగా అండర్, అన్ అసెస్మెంట్ ల క్షేత్ర స్థాయి సర్వే చేపట్టాలని, అలాగే ఆస్తి, నీటి పన్నుల వసూళ్లపై రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. గురువారం కమిషనర్ గారు నల్లచెరువు, నంబూరి సుభాని కాలనీ, శివరామ్ నగర్ తదితర ప్రాంతాల్లో ఆస్తి పన్ను వసూళ్లు, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో చేపట్టే అభివృద్ధి పనులకు పన్నుల వసూళ్లు కీలకమని, నూరు శాతం పన్నుల వసూళ్లకు వార్డ్ సచివాలయాల వారీగా అడ్మిన్ కార్యదర్శులు యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలని ఆదేశించారు. అండర్, అన్ అసెస్మెంట్ల పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ అధికారులు తమ పరిధిలో ర్యాండమ్ గా ఆస్తి పన్నులను తనిఖీ చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పరిశీలించి, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడంతో పాటు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. పలు ప్రాంతాల్లో డ్రైన్ ల్లో మురుగు పారుదల లేక పోవడం గమనించి, రోడ్ల మీద భవన నిర్మాణ వ్యర్ధాలు, సామగ్రి వేసే వారిని తక్షణం తొలగించుకోవాలని తెలియచేయాలని ప్లానింగ్ కార్యదర్శులను, నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ, డ్రైన్ల శుభ్రం చేయాలని శానిటేషన్ కార్యదర్శులను ఆదేశించారు.
పర్యటనలో కార్పొరేటర్ అడకా పద్మావతి, డిఈఈ మధుబాబు, రెవెన్యూ అధికారి మదన్ గోపాల్, ఆర్ఐలు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
