తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ, సెంట్రల్ బ్యూరో అఫ్ కమ్యూనికేషన్, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, విజయవాడ వారు సంయుక్తంగా సావేరి అతిథి గృహంలో నిర్వహించిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం దిగ్విజయంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి తెలుగు అధ్యక్షులు ఆచార్య కొలకలూరు మధుజ్యోతి అధ్యక్షత వహించి సభను నడిపించారు. ఉన్నత విద్య మాతృభాషలో జరిగితే ఉత్తమంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. అప్పారావు కమిటీ నివేదికలో కూడా మాతృభాషా మాధ్యమంలో పరీక్షలు రాయవచ్చు అనే విషయం ఉందన్నారు. భాష మనిషి సంస్కృతిని నిలుపుతుందని మనిషి మనుగడను ముందుకు తీసుకు వెళ్లడానికి దోహదకారి. భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో తెలుగు మూడవ భాషగా ఉండడం గర్వించదగ్గ విషయం అన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డీన్, ఆచార్య సి.వాణి మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమాల వల్ల కమ్యూనికేషన్ పెరుగుతుంది కానీ మాతృభాష మరుగున పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. మన ప్రాచ్యులు తెలుగు భాషను పెంచి పోషించారని,అదే క్రమాన్ని మనం ఆచరించి భావితరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేశారు. ప్రపంచ దేశాలు తెలుగును గుర్తిస్తున్న ఈ రోజుల్లో, దానిని మాతృభాషగా కలిగిన మనం దానిని వృద్ధి చేయాల్సిన కర్తవ్యాన్ని సూచించారు.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన అదనపు డైరెక్టర్ జనరల్ రాజీందర్ చౌదరి మాట్లాడుతూ హర్యానాలో తెలుగు రెండవ అధికార భాషగా ఉందని, తెలుగు భాష గొప్పదనాన్ని కొనియాడారు. ఇంగ్లీష్ హిందీ భాషల్లోనే ఎక్కువగా ఉపయోగిస్తున్నా, తెలుగు మాతృభాషను కలిగిన వారికి అనువాద వృత్తిలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ప్రాథమిక విద్య మాతృభాషలో ఉంటే విద్యార్థుల్లో ఎదుగుదల ఉంటుందన్నారు.
ఆత్మీయ అతిథిగా క్షేత్ర ప్రచార అధికారి శ్రీరామమూర్తి కందాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
“మాతృభాష సామర్థ్యం – యువత” అనే వ్యాసరచన పోటీలో మొదటి బహుమతి కె.వికిత ఎమ్.ఎస్.సి జువాలజి, రెండవ బహుమతి టి.మౌనిక ఎమ్.ఎస్.సి సెరికల్చర్, మూడవ బహుమతి ముల్లా ఫరీద బహుమతులు అందుకున్నారు.
“STEM కోర్సులు-మాతృభాష” అనే వక్తృత్వ పోటీలో మొదటి బహుమతి సి.హెచ్.జాహ్నవి ఎల్.ఎల్.ఎమ్, రెండవ బహుమతి పి.శ్రావణి ఎమ్.ఏ.తెలుగు, మూడవ బహుమతి ఎ.ప్రత్యూష ఎమ్.ఏ.తెలుగు బహుమతులను అందుకున్నారు.
“కృత్రిమ మేధ – నైతికత” అనే అంశంపై నిర్వహించిన కవి సమ్మేళనం పోటీలో మొదటి బహుమతి ఎ.మోహిత ఎమ్.ఏ.తెలుగు, ఎ.ప్రనూష ఎమ్.ఏ.తెలుగు, మూడవ బహుమతి పి. శ్రావణి ఎమ్.ఏ.తెలుగు బహుమతులు అందుకున్నారు.
న్యాయ నిర్ణేతలుగా డా.ఇందిరా ప్రియదర్శిని, డా.అనురాధ, డా.యువశ్రీ, డా.నీరజ, ఆచార్య నీరజ, డా.వై.సుభాషిణి వ్యవహరించారు.
ఈ కార్యక్రమానికి డా.వై.సుభాషిణి స్వాగతం పలుకగా, సమాచార , ప్రసార మంత్రిత్వ శాఖ నుండి విచ్చేసిన పి.హరి కృష్ణ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమానికి విద్యార్థినులు, వివిధ విభాగాల ఆచార్యులు, భాషా ప్రియులు, బోధనేతర సిబ్బంది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు పాల్గొని విజయవంతం చేశారు.
Prajavartha Online Telugu News