-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర బడ్జెట్ పూర్తిగా నిరాశను మిగిల్చిందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ లేదని.. ఏపీకి మరోసారి మొండిచేయే మిగిలిందని అభిప్రాయపడ్డారు. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు బడ్జెట్‌లో కొంతమేర కేటాయింపులు చేసినప్పటికీ.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. ఎన్నికలు ఉన్న బీహార్ లాంటి రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరాలు ప్రకటించి, మిగతా రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సరికాదన్నారు. ఎన్డీఏలో తెలుగుదేశం, జనతాదళ్ (యునైటెడ్) కీలకంగా వ్యవహరిస్తుండగా.. ప్రాజెక్టులు, బడ్జెట్ కేటాయింపులను రాబట్టుకోవడంలో బీహర్ సీఎం నితీష్ కుమార్ సక్సెస్ అయ్యారని మల్లాది విష్ణు అన్నారు. కానీ ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తిగా విఫలమవడంతో.. రాష్ట్రానికి మొండిచెయ్యే మిగిలిందన్నారు. ఎన్డీయేలో భాగస్వామ్యులై ఉంటూ రాష్ట్రానికి నిధులు రప్పించడంలో అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ వైఫల్యం చెందారని మల్లాది విష్ణు విమర్శించారు. ఏపీ అభివృద్ధికి కావలసిన నిధులపైనా కేంద్ర ఆర్థిక మంత్రి కనీసం ఎలాంటి హామీ ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా ఊసే లేదని.. విభజన హామీల ప్రస్తావన లేకపోవడం రాష్ట్ర ప్రజలకు తీవ్ర నిరాశను మిగిల్చిందన్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని మల్లాది విష్ణు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News