Breaking News

కేంద్ర ప్రభుత్వ పథకాల సద్వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సంక్షేమాభివృద్ధికి ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకాల సద్వినియోగంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాల సద్వినియోగంపై సమీక్షించారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాల ప్రగతితో పాటు ప్రజలకు అవగాహన లేకుండా మరుగున పడిపోయిన కేంద్ర ప్రభుత్వ పథకాలపై వ్యవసాయ, ఉద్యాన, సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టు, మత్స్య, పశుసంవర్ధక, విద్య తదితర శాఖల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ వర్గాల ప్రజల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని, వాటిని అర్హులైన వారందరికీ అందించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా పథకాలకు లబ్ధిదారులను గుర్తించి ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో యంత్రాలతో కోసిన ధాన్యాన్ని ఆరపెట్టేందుకు రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో ధాన్యాన్ని ఆరబెట్టే యంత్రాలను (డ్రైవర్లు) సబ్సిడీతో అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. వాటిని బృందం లేదా వ్యక్తిగతంగా అందించేందుకు అర్హులను గుర్తించి నివేదికను తయారు చేయాలన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థల (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్) బలోపేతానికి త్వరలో సంబంధిత అధికారులు, బ్యాంకర్లతో సమావేశానికి ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో తేనె పరిశ్రమ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. పసుపు పువ్వులు వికసించే చోట ఎక్కువగా తేనెటీగలు సంచరిస్తాయని, జనుము, కంది వంటి పంటలు సాగయ్యే ప్రాంతాలు వాటికి అనుకూలమని ఈ సందర్భంగా అధికారులు కలెక్టర్కు వివరించారు. విశ్వవిద్యాలయం, కళాశాలల్లో పీహెచ్డీ, పీజీ, డిప్లొమా చదివే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల స్కాలర్షిప్ లకు దరఖాస్తు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. మత్స్యకార వర్గాలకు కమ్యూనిటీ భవనాలు, ఇళ్ల నిర్మాణాలు, తాగునీటి సౌకర్యం, ఆధునిక పద్ధతుల్లో మత్స్య వేట తదితర సౌకర్యాల ఏర్పాటుపై శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం ఆయన ప్రకృతి వ్యవసాయ విధానంపై అవగాహన గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారిణి ఎన్ పద్మావతి, ఉద్యాన శాఖ అధికారిణి జె జ్యోతి, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ పీడీ విజయలక్ష్మి, హౌసింగ్ పీడీ ఎస్ వెంకటరావు, డీఈఓ పీవీజే రామారావు, అటవీ శాఖ అధికారిణి సునీత, ఆర్ ఐ ఒ సాల్మన్, కృష్ణా యూనివర్సిటీ ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *