-పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లి పెద్ద తిరునాళ్ల సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన నగర్ పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర బాబు ఐపీఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పెనుగంచిప్రోలు గ్రామంలోని వేంచేసి యున్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణం- పెద్ద తిరునాళ్లు సందర్భంగా ఈరోజు నగర పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజశేఖర బాబు ఐపీఎస్ దంపతులు అన్వాయితీ ప్రకారం అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పించి దర్శనం చేసుకోవడం జరిగింది.
అనంతరం ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు పెద్ద తిరునాళ్ల సందర్భంగా పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి టెంపుల్ మరియు టెంపుల్ పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేయు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం బందోబస్తు ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు సలహాలు అందించారు. అనంతరం ఏరియా మొత్తాన్ని డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలించారు.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజశేఖర బాబు మాట్లాడుతూ…… ఈ నెల 11 నుంచి 15 తేదీ వరకు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఉత్సవాలను పురస్కరించుకొని నగరం నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకు మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరియు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుంటూ నలుగురు ఏసీపీలు, 13 మంది ఇన్స్పెక్టర్లు, 30 మంది ఎస్ఐలతో మొత్తం 500 మంది సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్. వి.రాజశేఖర బాబు ఐపీఎస్ తో పాటు, ఏసీపీ ఏ బి జి తిలక్, టెంపుల్ అధికారులు, ఇన్స్పెక్టర్లు పి వెంకటేశ్వర్లు, డి చవాన్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.