-ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల జట్టుపై తమిళనాడు టీం అనూహ్య విజయం
-రెండో మ్యాచ్ లో కేరళ జట్టుపై కర్ణాటక ఘన విజయం
-ప్రతి బంతిని బౌండరీకి తరలించాలన్న తపనతో పోటాపోటీగా పరుగులు చేస్తున్న యువ క్రీడాకారులు, నిప్పులు చెరిగే బంతులు వేస్తూ బ్యాట్స్ మెన్ ను హడలెత్తించిన బౌలర్లు
-అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను అభినందించిన సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్స్ భాస్కర్ కల్లూరు, కిషోర్ రెడ్డి, ఆర్. శ్యామ్, రాకేష్ నాయక్, ఎన్. నిఖిల
-బుధవారం ఉదయం కేరళ వర్సెస్ తమిళనాడు, మధ్యాహ్నం ఆంధ్రా- తెలంగాణ వర్సెస్ కర్ణాటక రాష్ట్రాల జట్లకు మధ్య జరుగనున్న మ్యాచ్
అమరావతి / మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నేతృత్వంలో ఇండియన్ ఆడిట్స్ మరియు అకౌంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మంగళగిరి ఏసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోన్న ఐఏ అండ్ ఏడీ సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ -2025 లో భాగంగా రెండో రోజు జరిగిన రెండు మ్యాచ్ లు ఉత్కంఠభరింతగా సాగాయి. మంగళవారం ఉదయం 9 గం.లకు ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రాల జట్టు, తమిళనాడు రాష్ట్ర జట్టు మధ్య తొలి మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన తమిళనాడు రాష్ట్ర జట్టు బౌలింగ్ ఎంపిక చేసుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన ఆంధ్రా – తెలంగాణ రాష్ట్ర జట్టు నిర్ధేశిత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. ఆంధ్రా – తెలంగాణ రాష్ట్ర జట్టు బ్యాట్స్ మెన్ యష్ కొటారి 57 బంతుల్లో మూడు సిక్స్ లు, ఏడు ఫోర్లతో 77 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. తరుణ్ 27 పరుగులు చేశారు. తమిళనాడు జట్టుకు చెందిన అశ్విన్ బాలాజీ 4 ఓవర్లలో 39 రన్స్ ఇచ్చి 2 వికెట్లు పడగొట్టగా రవితేజ డీబీ 4 ఓవర్లలో 45 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. రాహుల్ బుద్ధి 1 వికెట్ తీసి 12 పరుగులు ఇచ్చారు. అశ్వత్ శ్రీధర్ 3 ఓవర్లలో కేవలం 6 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసి స్కోర్ కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన తమిళనాడు జట్టు ఐదు వికెట్ల తేడాతో ఆంధ్రా, తెలంగాణ జట్టుపై విజయం సాధించింది. తమిళనాడు జట్టు 18 ఓవర్లు ముగిసే నాటికి నాలుగు వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. తమిళనాడు జట్టు లక్ష్యం చేరేందుకు చివరి రెండు ఓవర్లలో 12 బంతుల్లో 27 పరుగులు చేయాల్సి రాగా 19వ ఓవర్లో నాలుగు పరుగులు మాత్రమే చేయటంతో చివరి ఆరు బంతుల్లో 23 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆంధ్రా,తెలంగాణ జట్టు గెలుస్తుందనుకున్న తరుణంలో మొదటి రెండు బంతులు బాట్స్ మెన్ ఫ్రాన్సిస్ రోకిన్స్ వరుసగా సిక్స్ లు కొట్టడంతో లక్ష్యం క్రమంగా తగ్గింది. మూడో బంతికి క్యాచ్ అవుట్ కాగా చివరి మూడు బంతుల్లో 11 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ కు వచ్చిన విఘ్నేష్ సింగిల్ తీయగా వేదాంత్ భరద్వాజ్ వరుసగా ఫోర్, సిక్స్ కొట్టడంతో విజయం తమిళనాడు జట్టును వరించింది. తొలి మ్యాచ్ లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చిన వేదాంత్ భరద్వాజ్ రెండో మ్యాచ్ లోనూ తనదైన శైలిలో ఆడి కేవలం 53 బంతుల్లో 3 సిక్స్ లు, 4 ఫోర్లతో 62 పరుగులు సాధించారు. అబ్దుల్ బాజిత్ 24 బంతుల్లో 3 సిక్స్ లు, 2 ఫోర్లతో 33 పరుగులు చేశారు.
మధ్యాహ్నం కర్ణాటక, కేరళ మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన కర్ణాటక ఫీల్డింగ్ ఎంచుకొంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన కేరళ నిర్ధేశిత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. కేరళ బ్యాట్స్ మెన్స్ సచిన్ 29 పరుగులు, శ్యామ్సన్ 24 పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్స్ దర్శన్ 4 ఓవర్లలో 21 రన్స్ ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా అర్జున్ గౌడ 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టారు. ఏఎం కిరణ్ 4 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన కర్ణాటక కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 128 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కర్ణాటక బ్యాట్స్ మెన్ అభిరాత్ రెడ్డి 37 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్ లతో 50 పరుగులు చేయగా అర్జున్ హొయసాలా 25 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టి 41 పరుగులు చేశారు. ఎస్ఎస్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లతో 29 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.. కేరళ బౌలర్లలో మణుకృష్ణన్ 25 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టగా, మిథున్ 29 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టారు. అంతిమంగా కర్ణాటక విజయాన్ని ఆపలేకపోయారు.
బుధవారం ఉదయం 9 గం.లకు కేరళ మరియు తమిళనాడు జట్ల మధ్య, అనంతరం మధ్యాహ్నం 1 గం.లకు ఆంధ్రా- తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య జరగనున్నాయి.
ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్స్ భాస్కర్ కల్లూరు, కిషోర్ రెడ్డి, ఆర్. శ్యామ్, రాకేష్ నాయక్, ఎన్. నిఖిలలు అభినందించారు. మెరుగైన ఆటతీరు కనబర్చిన టీమ్ ను ప్రశంసించారు.
Prajavartha Online Telugu News