-రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, ప్రణాళికాబద్ధమైన చర్యలకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. గురువారం అమరావతి లోని సచివాలయంలో మైనారిటీ మంత్రిత్వ శాఖ పేషీ లో మంత్రి ఫరూక్ ను వక్ఫ్ బోర్డు సభ్యులు డాక్టర్ ఆఫీయా, షేక్ ఖాజా తో పాటు పలువురు ముస్లిం మైనారిటీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. వక్ఫ్ బోర్డు కు సంబంధించిన పలు అంశాలు, వక్ఫ్ బోర్డు ద్వారా చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక అమలుకు సంబంధించి బోర్డు సభ్యులతో మంత్రి చర్చించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.వక్ఫ్ ఆస్తుల నిర్వహణ మరియు పరిరక్షణ, మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకోవడం, ఉన్న భూములను పరిరక్షించుకోవడం పై ఒక ప్రణాళికబద్ధమైన కార్యాచరణ సిద్ధం చేసి మైనారిటీ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో చర్యలు చేపట్టడం జరుగుతున్నదని మంత్రి అన్నారు.అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలో మైనార్టీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భాగంగా ప్రభుత్వం బడ్జెట్లో మైనార్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి నిధుల కేటాయింపు చేయడం జరిగిందన్నారు. 2025-2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కూడా మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం నిధుల కేటాయింపులో అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నదని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.
రంజాన్ మాసం లో ప్రత్యేక వసతులు కల్పించాలనికోరిన ఎంహెచ్ పిఎస్
రంజాన్ మాసంలో మసీదులు, ఈద్గాలు,దర్గాల వద్ద ప్రత్యేక వసతులు కల్పించాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను ఎంహెచ్ పిఎస్ నాయకులు కోరారు.
గురువారం అమరావతి సచివాలయంలోని మంత్రి పేషీ లో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షుబ్లీ తదితరులు మంత్రిని కలిశారు.రాష్ట్ర వ్యాప్తంగా మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చెయ్యాలని, టిడిపి ప్రభుత్వ హయాంలో అన్ని మసీదులకు మరమ్మత్తుల కొరకు ప్రతి ఏటా ఇచ్చే రూ.25వేలు మంజూరు చెయ్యాలని, శిక్ష అనుభవిస్తున్న ముస్లిం ఖైదీలకు సహారీ, ఇఫ్తార్ ఏర్పాటు కొరకు జైళ్ల శాఖకు ఆదేశించాలని, ప్రభుత్వం తరపున రంజాన్ ఉత్సవాలు (జష్నే రంజాన్) నిర్వహించాలని కోరారు.వచ్చే బడ్జెట్ లో మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేకంగా రూ.3296 కోట్లు మంజూరు చెయ్యాలని మంత్రిని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంహెచ్ పిఎస్ ఉలేమా వింగ్ అధ్యక్షులు మౌలానా అబ్దుల్ రషీద్,నాయకులు సగీర్, ఖాజా, అర్షద్, భాష తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News